భాగ్యనగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు దాదాపుగా రాష్ట్రంలో రెండు వందల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఓ ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న మల్లాపూర్ డివిజన్‌కు చెందిన 25 ఏళ్ల యువతికి గురువారం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. హైదరాబాద్ భవన్లో ఓ అధికారికి కరోనా సోకగా.. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ భవన్ మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
వెంగళరావు నగర్ డివిజన్లోని జవహర్ నగర్లో 65 ఏళ్ల వ్యక్తికి, అల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్ కాలనీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా.. వారిద్దరినీ అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు.
కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్...
కుత్బుల్లాపూర్ పరిధిలో ఆరుగురికి కరోనా సోకింది. శ్రీనివాస్ నగర్, గాజులరామారం, సాయిబాబానగర్, దులపల్లి, రాజీవ్ గాంధీనగర్, పేట్ బషీరాబాద్‌లలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కుకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్లో 22 ఏళ్ల యువకునికి, బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్లో 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా వారిని గాంధీకి తరలించి... కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. నిజాంపేట్‌కు చెందిన 34 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది.
మూడో రోజు గాంధీలో జూడాల నిరసన...
జియాగూడ ఇందిరానగర్‌లో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెంది ఐదు రోజులు గడుస్తున్నా.. వారి కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్ చేయకపోవటం వల్ల వారు బయటే తిరుగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీలో జూనియర్ వైద్యులు మూడో రోజు నిరసన కొనసాగించారు. కొవిడ్ రోగులకు గాంధీతో పాటు ఇతర ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని జూడాలు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వైద్యులపై దాడిని నిరసిస్తూ.. తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.