రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మూడో వారం లేదా జూన్ మొదటి వారంలో డ్రోన్ల ద్వారా కరోనా ఔషధాల పంపిణీ చేపట్టడానికి సిద్ధమవుతోంది. ముందుగా వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభించి ఆ తర్వాత ఇతర జిల్లాలకు విస్తరించనుంది. గరిష్ఠంగా 30 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు టీకాలను, ఔషధాలను పంపిణీ చేయాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే దూర ప్రయాణ సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకొని వినియోగించేందుకు సన్నాహాలు చేపట్టింది. మొదటి దశలో 7 డ్రోన్లతో 24 రోజుల పాటు ప్రయోగాత్మకంగా రవాణా చేపడతారు. వాటి పనితీరును పరిశీలిస్తారు. సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తారు.
ఎంత దూరమైనా అనుమతి
తెలంగాణలో డ్రోన్ల ద్వారా అత్యవసర కరోనా ఔషధాల రవాణాకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిబంధనను సడలించింది. ప్రయాణ పరిమితిని తొలగిస్తూ ఎంత దూరమైనా వెళ్లడానికి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. మంత్రి కేటీ రామారావు ఆదేశాల మేరకు కొవిడ్ టీకాలు, ఔషధాల పంపిణీ కోసం డ్రోన్లను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం గత వారం ఆదేశాలు జారీ చేసింది. ఆ నిబంధనల ప్రకారం కనుచూపు మేరకే డ్రోన్లను వినియోగించాలి. అది అయిదు కిలోమీటర్ల లోపే ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖకు మరోసారి లేఖ రాసింది. పరిగణనలోకి తీసుకొన్న కేంద్ర ప్రభుత్వం అపరిమిత దూరం డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించింది.
మరిన్ని సేవలకు ఆస్కారం
కనుచూపు మేర కంటే ఎక్కువ దూరం డ్రోన్ల రవాణాకు కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ అనుమతించడం హర్షణీయం. దీని ద్వారా మరిన్ని గ్రామాలకు ఆరోగ్య సేవలందించేందుకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది.
- జయేశ్‌రంజన్, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి
ఇదీ చదవండి: భూ దందాలపై గవర్నర్‌కు లేఖ రాస్తా: ఉత్తమ్