హైదరాబాద్‌లాంటి మెట్రో నగరంలో గ్రామాలు, పట్టణాల్లో అయినా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రజారవాణా వ్యవస్థతో పాటు ఆటోవాలాలు ఎంతో కీలకం. రవాణా వ్యవస్థలో కీలకమైన ఆటో డ్రైవరన్న కొవిడ్ విజృంభన, డీజిల్ భారం, గ్యాస్ బాదుడు, సరిపడా గిరాకీల్లేక అవస్థలు పడుతున్నాడు.
ఒకప్పుడు రోజుకు రూ. 1,000 నుంచి రూ. 2 వేల వరకు సంపాదించి.. ఖుషీగా ఇంటికెళ్లే డ్రైవరన్న కరోనా దెబ్బకి కోలుకోలేకపోతున్నాడు. పెరుగుతోన్న కేసులతో ఒక వైపు వైరస్ భయం, మరోవైపు రుణభారాలు ఆటోవాలాలను కుంగదీస్తున్నాయి. దొరికిన కొద్దిపాటి గిరాకీలతో నెట్టుకొద్దామనుకుంటే.. చెల్లుబాటు కాక ఢీలా పడిపోతున్నామని వాపోతున్నారు.
కష్టంగా మారిన జీవనం...
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలామంది ఆటోలను ఫైనాన్స్‌కు తీసుకొని రోజువారీ కూలీలో కొంత మొత్తం ఫైనాన్స్ చెల్లిస్తూ.. మిగిలిన మొత్తంతో జీవనం నెట్టుకొస్తుంటారు. గతేడాది కరోనా దెబ్బకి దాదాపు 8 నెలల పాటు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడిన ఆటోవాలాలు.. ఇప్పుడు మళ్లీ కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో ఆటోల్లో ప్రయాణించేందుకు సరిగా ప్రయాణికులు లేక ఆటోస్టాండ్ల వద్దనే ఖాళీగా నిరీక్షిస్తున్నారు.
కరోనా భయాలు...
కొవిడ్ విజృంభణతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాల వద్ద ఆంక్షలు, పెద్దగా టూరిస్టులు లేకపోవటం, రాకపోకలు తగ్గుముఖం పట్టడం, పాఠశాలలు, ఆఫీసులు మూతపడటం వల్ల ఇప్పటికే చాలా వరకు బేరాల్లేకుండా పోయాయని... కొవిడ్ నిబంధనలైన సామాజిక దూరం, కరోనా భయాలతో ఎక్కేవారు సైతం వెనకడుగేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
కరోనా ప్రభావంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది. నగరవాసులు ప్రజారవాణా కన్నా.. సొంత వాహనాల్లో ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వర్క్ ఫ్రం హోం కొనసాగటం, రోజురోజుకీ కేసుల తీవ్రత పెరగటం వీరి ఆదాయంపై మరింత ప్రభావం చూపుతోంది.
నిబంధనలు...
ఆటోవాలాలు సైతం పెద్దగా మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలను సరిగా పాటించకపోవటంతో ఎక్కువ మంది ఓలా, ఉబర్ వంటి క్యాబులు, ఆటోల్లోనే ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా సైట్లలో రైడర్ మాస్కు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ఉండటం... ఇంత మందినే ఎక్కించాలనే పలు నిబంధనల వల్ల సేఫ్‌గా ఉండొచ్చనే భావన సైతం కారణమవుతోందని నిపుణులు అంటున్నారు.