రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 400కు సమీపించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకూ 64,898 పరీక్షల ఫలితాలు రాగా.. 394 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 81 మంది కరోనా బారినపడ్డారు. మరో ముగ్గురు వైరస్‌తో చనిపోయారు. 24 గంటల వ్యవధిలో 194 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 804 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
మెట్‌పల్లిలో ఐదుగురికి..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వివిధ కాలనీలకు చెందిన 20 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. అందులో ఐదుగురికి కొవిడ్‌గా తేలింది. బాధితుల ఇళ్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులు రసాయనాలతో శానిటైజ్ చేశారు. జనం సమూహాలుగా తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ముథోల్‌లో 16 మంది విద్యార్థులకు..
నిర్మల్ జిల్లా ముథోల్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మరో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 16 మంది విద్యార్థులతో ఒకరు వంట సిబ్బంది ఉన్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. కొత్త కేసులతో కలిపి మొత్తం 26 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఎమ్మెల్యే బాసట..
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి ప్రభుత్వ వసతిగృహంలో కరోనా బారినపడ్డ 40 మంది విద్యార్థులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న బాసటగా నిలిచారు. చిన్నారులకు ఉచితంగా శానిటైజర్, మాస్క్, పౌష్ఠికాహారం, పాలు, గుడ్లు అందించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.