రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల వేడి రాజుకుంది. నిన్నటి నుంచి నామినేషన్లను స్వీకరించగా... తొలిరోజు గురువారం 2,308 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపటి వరుకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు ఉంటుంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
906 సహకార సంఘాలకు ఎన్నికలు
సొసైటీల్లో వ్యవసాయ అప్పులు, సభ్యత్వ రుసుములు చెల్లించని రైతుల పేర్లను తొలగించిన సహకారశాఖ ఎన్నికల అథారిటీ ఓటర్ల జాబితాలను ఆయా సంఘాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించింది. మొత్తం 906 సహకార సంఘాలకు గాను మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక సొసైటీ మినహా... మిగతా అన్ని సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సొంత నిధులతోనే ఎన్నికల నిర్వహణ
ప్రతి సొసైటీ తమ సొంత నిధులతోనే ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంది. ప్రతి సహకార పరపతి సంఘానికి 13 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 11 వేల 765 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలు, బీసీలు 750, ఓసీ-ఇతరులు వెయ్యి రూపాయల చొప్పున నామినేషన్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఓటర్లను 13 డైరెక్టర్ వార్డులుగా విభజిస్తారు. ఈ 13 వార్డుల్లో 2డైరెక్టర్ పదవులు మహిళలు, మరో రెండు డైరెక్టర్ పదవులు బీసీలు, ఒక డైరెక్టర్ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఒకరికి రిజర్వు చేసినట్లు సహకార వర్గాలు తెలిపాయి. సహకార సంఘం ఛైర్మన్ పదవికి ఎన్నికయ్యే అభ్యర్థికి మాత్రం రిజర్వేషన్ వర్తించదు.
రెండు సెట్లకు మించి చేయరాదు
సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్కో అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్ పత్రాలకు మించి దాఖలు చేయరాదు. ఒక డైరెక్టర్ వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తి మరో డైరెక్టర్ వార్డులో పోటీ చేయవచ్చు. అయితే సదరు అభ్యర్థిని బలపరిచి, ప్రతిపాదించే వ్యక్తులు మాత్రం ఆయా వార్డుల్లోనే విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుందని సహకారశాఖ వర్గాలు వెల్లడించాయి. బలపరిచే, ప్రతిపాదించే వ్యక్తులు ఓటు వేసేందుకు అర్హులై ఉండాలి. నామినేషన్ పత్రం ఎన్నికల అధికారికి సమర్పించే సమయంలో తప్పనిసరిగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పోటీచేసే వ్యక్తితో ఉండాల్సి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఒక్కో డైరెక్టర్ ఎన్నికకు ఒక్కో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చూడండి: వారితో వేడుక చేసుకున్న ట్రంప్!