బీమా వైద్య సేవల కుంభకోణంలో నిందితులుగా ఉన్న అధికారుల సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. బీమా వైద్య సేవల కుంభకోణం సంచాలకురాలు దేవికారాణితో పాటు మరో 8 మంది సస్పెన్షన్ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాన నిందితురాలైన దేవికా రాణి జనవరిలో పదవీ విరమణ పొందారు. సంయుక్త సంచాలకురాలు కల్వకుంట్ల పద్మ, సహాయ సంచాలకురాలు వసంత ఇందిర, ఇతర ఉద్యోగులు రాధిక, హర్షవర్ధన్, సురేంద్రనాథ్, నాగలక్ష్మి, లావణ్య, వీరన్న సస్పెన్షన్‌లో ఉన్నారు. బీమా వైద్య సేవల కుంభకోణంలో వీళ్లందరి పాత్ర ఉన్నట్లు అనిశా అధికారులు కేసులు నమోదు చేశారు.
అవసరం లేకున్నా... ఔషధాలు కొనుగోలు చేయడం, విపణిలో ఉన్న ధరల కంటే అధిక మొత్తం చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లేలా చేశారని అనిశా దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వం దేవికా రాణితో పాటు 8 మంది నిందితులను 2019లో సెప్టెంబర్‌లో సస్పెన్షన్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 8 మంది సస్పెన్షన్‌లోనే ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.