Congress Party Prajapalana In Telangana : ప్రజాపాలన కార్యక్రమం వేళ రాష్ట్రంలో ఊరు వాడ సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీ పథకాల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. గురువారం నుంచి జనవరి 6 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి మహాలక్ష్మీ, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు చేయుత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డులు(Ration cards) ఇతర అవసరాలకు వినతి పత్రాలు, ఫిర్యాదులను తీసుకుంటున్నారు.
Special Counters Serilingampally Constituency : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపుర్(Kondapur) డివిజన్ హఫిజ్ పేట్ ప్రేమ్ నగర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రానికి ప్రజలు బారులు తిరారు. అధిక సంఖ్యలో జనాలు రావడంతో సెంటర్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రేమ్ నగర్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రజా పాలన సెంటర్లో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్కు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో మరో నాలుగు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అధికంగా ప్రజలు ఉన్న కాలనీలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
"ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తు కోసం ఎక్కువ మంది ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా 8 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశాం. బారికేడ్లు వేసి, అర్హులందరికీ ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తులు అందిస్తున్నాం. ఆ దరఖాస్తు నింపి జనవరి 6 తేదీ వరకు ఎప్పుడైనా వచ్చి సమర్పించవచ్చు. అర్హులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయట జీరాక్స్ సెంటర్, మీ సేవ కేంద్రం నుంచి పొందాల్సిన పని లేదు. ఇక్కడే అందరికి ఉచితంగా పంపీణీ చేస్తున్నాం. గడువు లోగా పూర్తి వివరాలతో నింపి సమర్పించాలని కోరుతున్నాం." - శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్
ప్రజా పాలన తెచ్చుకోవడంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానం : మంత్రి పొంగులేటి
డిసెంబర్ 28 నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రాల్లో ప్రజలకు ఉచితంగా దరఖాస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. జీరాక్స్ సెంటర్లలో (Xerox Center) ఎవరైనా ఆరు గ్యారంటీల దరఖాస్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తిసుకుంటామని కమిషనర్ తెలిపారు. ప్రజలు అపోహాలకు గురి కాకుండా దరఖాస్తులు జిరాక్స్ కాపీ, కలర్ కాఫీ ఏదైనా సెంటర్లో తీసుకోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని నాలుగో వార్డులో ప్రజాపాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరుగ్యారంటీ పథకాలు అమలు జరిగేనా అంటూ ఓ వ్యక్తి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నేతలు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య తోపులాట పెరగగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.