రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటున్న హస్తం నేతలు.. అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ గాంధీ భవన్లో రెండు రోజులపాటు నేతలతో సమీక్షలు జరిపినా.. అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయారు. రెండు స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌లో 50 మందికిపైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి కమిటీకి అప్పగింత
ఆశావహుల సంఖ్య ఎక్కువ ఉండటంతో వాటిని ఫిల్టర్ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేయాలని ఠాగూర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు. రెండు రోజుల పాటు మరోసారి ఆయా జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపి.. అధిష్ఠానానికి అభ్యర్థుల పేర్ల జాబితా పంపాలని ఆదేశించారు.
నేతలు అసంతృప్తి
అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్రానికి వచ్చిన మాణిక్కం ఠాగూర్‌పై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిటీని వేసి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కమిటీ వేసేందుకు ఇంఛార్జ్ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉందా అంటున్నారు. ఠాగూర్ వల్ల కానిది జీవన్ రెడ్డి కమిటీతో అవుతుందా అని అంటున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థుల ఎంపిక.. కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.
ఇదీ చదవండి: రోగ నిరోధక శక్తిలో నీరే కీలకం