సీఎం కేసీఆర్ పొగడ్తలకే అసెంబ్లీని పరిమితం చేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల ప్రస్తావనకు అవకాశం లేకుండా అసెంబ్లీని మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద ఆమె మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మైక్‌లు కట్ చేస్తున్నారని... అధికార పార్టీ సభ్యుల పొగడ్తలకు మాత్రం గంటల సమయం ఇస్తున్నారని ఆరోపించారు. శూన్య గంటను ఎత్తేశారని.. ప్రజా సమస్యల ప్రస్తావనకు అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలను కేవలం వారిని వారు పొగిడేందుకు మాత్రమే జరుపుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశమివ్వడం లేదు. ప్రజా వేదికను ఈ రకంగా నడపడం ఎంతవరకు సమంజసం. ప్రభుత్వ హామీలపై మేము ప్రశ్నిస్తే మా మైకులు కట్ చేస్తున్నారు. తెలంగాణ అంటే ఇప్పుడే పుట్టింది అన్నట్లు మాట్లాడుతున్నారు. కేవలం ఏడేళ్లలోనే అభివద్ధి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఉద్యోగుల విరమణ వయస్సును పెంచి నిరుద్యోగులను మోసం చేశారు. వాస్తవాలను బయటకు రాకుండా అధికార పార్టీ గొప్పలకే అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చారు. -కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ములుగు నియోజకవర్గం