ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. జనం లేక ఎల్బీ స్టేడియంలో సీఎం సభ వెలవెలపోయిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఏటా పదివేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన కేసీఆర్... ఇంతవరకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గత గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
ఏడు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తుంటే ప్రధాని మోదీ... మూడు కంపెనీలను మాత్రమే ఎందుకు పరీక్షించారని ప్రశ్నించారు. భాజపా అగ్ర నాయకులంతా హైదరాబాద్‌లో ఉంటే మోదీ హైదరాబాద్ రావడం ఎన్నికల కుతంత్రం కాదా అని నిలదీశారు. ప్రధాని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం లేకపోవడం తెలంగాణ ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు.
ఉద్యమ సమయంలోనే హైదరాబాద్ వరదల గురించి మాట్లాడి... అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్లు అయినా ఎందుకు వరద నివారణ చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : తత్ప్రణమామి సదాశివలింగం..!