Dasoju Sravan Joined BJP: తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని దాసోజు శ్రవణ్ అన్నారు. దిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, భద్రత చర్యల పట్ల ఆకర్షితులై భాజపాలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా గతంలో తాను ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పని చేశానని.. ఇప్పుడు సొంతింటికి వచ్చినట్లుగా ఉందని దాసోజు శ్రవణ్ అన్నారు. వందల మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్‌లో పుట్టే పిల్లలపైనా అప్పుల భారం పడనుందని.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు.
రూ.35 వేలతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచారని శ్రవణ్ విమర్శించారు. కాళేశ్వరం కాదు కేసీఆర్ కమిషనరేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. బిస్వాల్ కమిటీ లక్షన్నర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినా.. 80-90 వేల ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని.. యువకులు ఉపాధి హామీ పనులు చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నియామకాలు, నిధులతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించ పరుస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయని.. కేటీఆర్ పిల్లలను టీచర్లు లేని స్కూల్లో చదివిస్తారా? అని ప్రశ్నించారు.
పాఠశాలల్లో సరైన వసతులు లేవని.. పేదవారు చదువుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. వైద్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని.. సంక్షేమ పథకాల పేరుతో బెల్టు షాపులు తెరిచారని ఆరోపించారు. తెరాస నేతలు జనాల రక్తాన్ని తాగుతున్నారని.. తెల్ల రేషన్ కార్డులతో అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చీకోటి ప్రవీణ్‌లు ఉన్నారని.. అలాంటి వారిని తెరాస నేతలు మోస్తున్నారన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి అవసరం ఎంతైనా ఉందని దాసోజు శ్రవణ్ అన్నారు. అందుకే కేసీఆర్‌ను గద్దె దించే పార్టీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య తెలంగాణను నిర్మించేలా, జయశంకర్ ఆశయాలు సాధించేలా భాజపాలో పని చేస్తానని స్పష్టం చేశారు. మోదీ ఆశయాలు నెరవేర్చేలా తెలంగాణలో పని చేస్తానని తెలిపారు. రెండేళ్లుగా భాజపాలో చేరాలని బండి సంజయ్ కోరారని.. ఆయనకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
చాలా సంతోషంగా ఉంది..: తెలంగాణ బిడ్డ శ్రవణ్ భాజపాలో చేరడంతో చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మనస్ఫూర్తిగా ఆయనను భాజపాలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. దాసోజు శ్రవణ్ చేరికతో భాజపా మరింత బలపడుతుందని జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. తెరాసపై పోరాడేందుకు మరింత దూకుడుగా ముందుకు వెళ్తామన్నారు.
మంచి పరిణామం..: దాసోజు శ్రవణ్ భాజపాలోకి రావడం మంచి పరిణామమని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. తెలంగాణ కోసం కసితో పనిచేశారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతలను పక్కన పెట్టారని.. కేబినెట్లో 10 మంది బయటి వారికి స్థానం కల్పించారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎంతో చురుకుగా పనిచేసిన శ్రవణ్.. భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తారని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్ చేరికలతో పార్టీ మరింత బలంగా మారుతుందన్నారు. అవినీతి రాజ్యం పోయి.. భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివేక్ వెంకట స్వామి తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వివేక్, మురళీధర్ రావుకు దాసోజు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌లో జాతీయ స్థాయి చేనేత ప్రదర్శన.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
కంప్యూటర్ సెంటర్లో మహిళపై గ్యాంగ్‌రేప్.. కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..