Congress Serious On TSPSC Paper Leakage Issue: రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో నెలకొన్న తాజా పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీకి రెండు కళ్లుగా భావించే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేర్వేరు చోట్ల పాదయాత్రలు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు.
TSPSC Paper Leakage Issue: ఇదే సమయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటికి రావటంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని అవకాశంగా మార్చుకుని, సర్కార్‌పై కాంగ్రెస్ రాజకీయ పోరాటానికి దిగింది. లీకేజీ తతంగం వెలుగులోకి వచ్చిన వెంటనే పార్టీలోని యువజన, విద్యార్థి విభాగాలు ఆందోళనలకు దిగగా.. పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టిన రేవంత్‌రెడ్డి.. పేపర్ లీకేజీ వెనుక ఉన్న పెద్ద తలలను సిట్ బయటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు: ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ పాత్ర ఉందంటూ రేవంత్ చేసిన ఆరోపణలు చర్చనీయంగా మారాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన సిట్.. కేటీఆర్ పీఏ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన వివరాలను తమకు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న సిట్ ఎదుట హాజరై.. వివరాలు అందచేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే సిట్ విచారణ జరిపితే నిరుద్యోగులకు న్యాయం జరగదని కాంగ్రెస్ వాదిస్తోంది. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పూర్తి వివరాలు బయట పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్.. హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే నిన్నటి హైకోర్టు విచారణలో గట్టిగా వాదనలు వినిపించేందుకు గతంలో వ్యాపం కుంభకోణంపై వాదించిన అనుభవం ఉన్న ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్‌ను రేవంత్‌రెడ్డి రప్పించారు. కాంగ్రెస్ తరఫున వివేక్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తమ వాదనలు వినిపించారు.
ఈ అంశంపై ఉద్ధృతంగా పోరాటాలు: ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమకు నివేదించాలని హైకోర్టు సిట్‌ను ఆదేశించించింది. పేపర్ లీకేజీ అంశంపై మరింత ఉద్ధృతంగా పోరాటాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఓయూలో విద్యార్థి సంఘాలు తలపెట్టిన నిరసన దీక్షలకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా.. ప్రశ్నాపత్రం లీకేజీ అంశం ప్రకంపనల వేళ కాంగ్రెస్ ఆరోపణలపై అధికార బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. యువతను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి: