Congress on Telangana Formation Day Celebrations : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను.. రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై నేతలు చర్చించారు. ఇకపై ప్రతినెలా మొదటి వారంలో పీఏసీ భేటీ జరగాలని వారు అన్నారు.
Telangana Formation DAY Celebration For 20 Days : ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ సమావేశాలు నిర్వహిస్తామని.. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తెలిపారు. జూన్ 2 నుంచి బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమం చేపడతామని వివరించారు. ప్రతి మండల కేంద్రంలో పార్టీ జెండాతో పాటు.. జాతీయ జెండాను ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు తమ ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. 20 రోజుల కార్యక్రమంలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆహ్వానించాలని నిర్ణయించామని వివరించారు. 30శాతం కమిషన్ తీసుకునే ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో దిమ్మ తిరిగే తీర్పు ప్రజలే ఇస్తారని మధుయాష్కీ ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్ 79 స్పష్టంగా వివరించిందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు అతి తక్కువ రోజులు హాజరైన.. ప్రధానమంత్రులలో నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారని వివరించారు. పార్లమెంట్ అందరిదని.. మోదీనే పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం మాట్లాడిన దాంట్లో తప్పేముంది? : కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి మాట్లాడితే తప్పు లేదు కానీ.. హిమాచల్‌ప్రదేశ్ సీఎం ఇక్కడకు వచ్చి మాట్లాడితే తప్పేమిటని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో తాము ఇచ్చిన హామీలను నేరవేర్చామని సుఖ్వీందర్‌సింగ్ సుక్కు చెప్పినట్లు వివరించారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఫలితాలతో ప్రజల నిర్ణయం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ 20 రోజుల కార్యక్రమంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుందని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముందని శ్రీధర్‌బాబు నిలదీశారు
బీజేపీ వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో : తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ అని హనుమంతరావు స్పష్టం చేశారు. బీజేపీ వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావడం లేదని అన్నారు. నిజాంకు వ్యతిరేకం అనే బీజేపీ.. గోల్కొండ మీద జెండా ఎగురవేస్తామంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.. పంజాగుట్టలో తాను అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని కొట్లాడితే.. తనకు ఎక్కడ పేరు వస్తుందోనని.. బీఆర్ఎస్ వాళ్లే ఏర్పాటు చేశారని హనుమంతరావు ఆరోపించారు.
ఇవీ చదవండి: Telangana Decade Celebrations : దద్దరిల్లేలా దశాబ్ది వేడుకలు.. షెడ్యూల్ ఇదే
TELANGANA FORMATION DAY 2023 : జూన్ 2న కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు