Sabitha Indra Reddy: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముందు బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీని ఇప్పటివరకూ ఎందుకు నేరవేర్చలేదని ప్రశ్నించారు. ఫలితంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అసలేం జరిగిదంటే: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర(basara rgukt) ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.
మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు భాజపా ఎంపీ సోయం బాపూరావు వస్తుండగా.. లోకేశ్వరం మండలంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తోందని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా ఆర్జీయూకేటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్యల పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించినందున.. విద్యార్థులు సంయమనం పాటించాలని బాసర ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. భోజనం, తాగునీరు, మిగతా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. మెస్‌లో ఇద్దరు వార్డెన్లను నియమించినట్లు వివరించారు. సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు డైరెక్టర్ సతీశ్ కుమార్ అందుబాటులో ఉంటారని.. సమస్యలను ఆయనకు వివరించవచ్చని వెంకటరమణ హామీ ఇచ్చారు.
విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతినెలకు ఒకసారి తరగతి ప్రధినిధులతో సమావేశమవుతామని వీసీ వెంకటరమణచెప్పారు. క్యాంపస్‌లో దివ్యాంగుల కోసం 11 లిఫ్టులు బాగు చేయించినట్లు తెలిపారు. విద్యాలయంలోని అన్ని విభాగాల పనితీరు పరిశీలించడానికి నిష్ణాతులతో కమిటీ ఏర్పాటు చేశామని ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ స్పష్టంచేశారు.
ఇవీ చదవండి: ఆర్జీయూకేటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన.. ఎంపీ అడ్డగింత