జేఎన్‌టీయూ-హైదరాబాద్ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదాను వదులుకోవాలని వర్సిటీ తాజాగా నిర్ణయించింది. ఈమేరకు యూజీసీకి లేఖ రాయనుంది. అలానే వర్సిటీ ప్రాంగణంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్‌టీ)ని.. ఇంజినీరింగ్ కళాశాలలో విలీనం చేసింది. వర్సిటీకి న్యాక్ హోదా పెంపునకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు యాజమాన్యం చెబుతుండగా.. ఆచార్యులు, విద్యార్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలానే వర్సిటీ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాలను ‘జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ’గా పిలవనున్నారు.
33 ఏళ్ల క్రితం ఏర్పాటు..: వర్సిటీలో ఇంజినీరింగ్, ఐఎస్‌టీ, ఎస్‌ఐటీ (స్కూల్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ) కళాశాలలున్నాయి. 33 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఐఎస్‌టీలో సైన్స్ పీజీ, పీహెచ్‌డీ కోర్సులు బోధిస్తున్నారు. ఎస్‌ఐటీలోనూ ఎంఎస్‌ఐటీ తదితర పీజీ, పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే ఎస్‌ఐటీని ఇంజినీరింగ్ కళాశాలలో కలిపేయగా, తాజాగా ఐఎస్‌టీని విలీనం చేశారు. ఆ మూడు కళాశాలల పరీక్షల విభాగాలను వర్సిటీ ప్రధాన పరీక్షల విభాగంలో కలిపారు. వర్సిటీ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాల, ఐఎస్‌టీకి యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా, జేఎన్‌టీయూహెచ్‌కు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉంది. వర్సిటీకి ఉన్న ఏ గ్రేడ్‌ను ‘ఏ ప్లస్’కు తీసుకురావాలంటే.. అటానమస్‌గా ఉన్న ఆ రెండు కళాశాలలకు ఆ హోదాను తొలగించాలని, అప్పుడు వాటిని వర్సిటీలో భాగంగా పరిగణనలోకి తీసుకొని ఏ ప్లస్ గ్రేడ్ ఇస్తారని యాజమాన్యం భావిస్తోంది.
వర్సిటీకి న్యాక్ ఏ ప్లస్ హోదా వస్తే పరిశోధన ప్రాజెక్టులు భారీగా వస్తాయని, ఆన్‌లైన్ కోర్సులను అందించవచ్చని, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌ఐటీ, ఐఎస్‌టీల విలీనంపై స్పందిస్తూ.. విద్యార్థులు జేఎన్‌టీయూహెచ్‌లో చదువుతున్నామని చెబుతారు తప్ప.. ఎస్‌ఐటీ, ఐఎస్‌టీల్లో అని చెప్పరని, చెప్పినా ఎవరికీ తెలియదని, వర్సిటీ హోదా పెరగడం అన్ని విధాలా మంచిదని పేర్కొంటున్నాయి.
నేటి నుంచి విద్యార్థుల ఆందోళన: ప్రత్యేకంగా నడుస్తున్న విభాగాలను విలీనం చేయడంతోపాటు ఇంజినీరింగ్ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా లేకుండా చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేయాలని విద్యార్థులు నిర్ణయించారు.
ఇవీ చదవండి: