ఆడవారు ఎందులోనూ తక్కువకాదంటూ ఎప్పటికప్పుడూ నిరూపిస్తునే ఉన్నారు. మగవారితో సమానంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. సుకుమారంగా ఉండే కొలువులే కాదు... కఠినంగా ఉండే పోలీస్, ఆర్మీ ఉద్యోగాల్లోనూ సత్తా చాటుతున్నారు. యూనిఫామ్ ఉద్యోగాల కోసం కఠోరంగా శ్రమిస్తున్నారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ మైదానంలో అతివలు పోలీస్ కొలువుల కోసం కసరత్తులు చేస్తున్నారు.
పురుషులతో పోటీపడుతూ కఠోర సాధన చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా.. ఉద్యోగం సంపాదించాలనే కసితో చెమటోడుస్తున్నారు. లాంగ్ జంప్, హై జంప్, పరుగు విభాగాల్లో సాధన చేస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. వరంగల్ అర్బన్ పోలీసులు సుమార్గ్ ద్వారా వీరికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
సుమారు 250 మంది యువతులతో పాటు 400 మంది యువకులు సుమార్గ్ ద్వారా శిక్షణ పొందుతున్నారు. ఇందుకు ఎస్సై స్థాయి అధికారులతో ఓ టీం ఏర్పాటు చేశారు. ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదివరకే సుమార్గ్ ద్వారా చాలా మంది ఉద్యోగాలు సంపాదించారని అధికారులు పేర్కొన్నారు.
నిత్యం శాంతి భద్రతలను కాపాడటమే కాకుండా పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.