CM Revanth Reddy Delhi Tour Updates : రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వివాదాల్లో నెలకొన్న తరుణంలో ప్రక్షాళన దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వరుస వివాదాల వేళ కమిషన్ ప్రక్షాళనకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్, సమూల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది.
గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా, వివాద రహితంగా పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీతో పాటు కేరళ లాంటి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల పని తీరుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ(TSPSC) అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
CM Revanth Meet UPSC Chairman : ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకాలు చేపడతామని అన్నారు. టీఎస్పీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమిస్తామని సీఎం యూపీఎస్సీ ఛైర్మన్‌కు వివరించారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు.
రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు గానూ పలు అంశాలపై మనోజ్ సోనీతో చర్చించినట్టు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంభిస్తున్న విధానాలను తెలుసుకున్నట్లు సమాచారం.
16వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం భేటీ : హైదరాబాద్ నగరంలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం రక్షణ మంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనను కలిశారు.
CM Revanth Meet Central Minister Rajnath Singh : హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి మెహిదీపట్నంలోని రైతు బజారులో స్కైవాక్(SKY Walk) నిర్మాణానికి 0.21 హెక్టార్ల ఢిపెన్స్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభ్యర్థించారు. సీఎం రేవంత్ అభ్యర్థనకు రాజ్‌నాథ్ సింగ్ సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండం కలుపుతూ రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, 83 ఎకరాల రక్షణ భూములను బదలాయించాలని రక్షణ మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన