CM Kcr Wishes: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలతో జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని తెలిపారు. సృష్టి లయకారునిగా శివుడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
రాజన్న గుడిలో శివరాత్రి సంబురం..
ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి మహా జాతరకు ముస్తాబైంది. వేములవాడ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి సందడి కనిపిస్తోంది. ఆలయ దారి వెంట ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుద్దీపాలంకరణలో రాజన్న కోవెల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూడ్రోజుల పాటు జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
శివరాత్రికి సిద్ధమైన వేయిస్తంభాల గుడి..
హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం వేడుకలకు సిద్ధమైంది. భక్తుల కోసం ప్రత్యేకఏర్పాట్లు చేశారు. ఎండవేడి తగలకుండా చలువ పందిళ్లు వేశారు. తెల్లవారుజాము నుంచే జాతర ప్రారంభం అవుతుందని అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి: Vemulawada Rajanna temple : మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం