CM KCR Phone Call to BRS Candidates : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రోజూ ఉదయాన్నే అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జీలు, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ నేరుగా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎలక్షన్ వాతావరణం ఎలా ఉందని నాయకుల వద్ద ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న తాజా రిపోర్టుల ప్రకారం సానుకూల, ప్రతికూలతలను విశ్లేషిస్తూ.. ఏయే అంశాల్లో ఇంకా మెరుగుపడాలో వారికి సూచిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే అందుకే ఆలోచించి ఓటేయండి : కేసీఆర్
కిందిస్థాయి నాయకులకూ ఫోన్..: ప్రచారాలకు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని, ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య సమన్వయం లేని నియోజకవర్గాలు, ప్రతికూలతలు ఎక్కువగా ఉన్న చోట్ల కిందిస్థాయి నాయకులతోనూ కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం.
BRS Aims For Hattrick Win in Telangana 2023 : ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కేసీఆర్ మాట్లాడినట్లు తెలిసింది. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉన్న చోట ప్రత్యేక దృష్టి సారించాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కొంతమంది జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీలతో మాట్లాడిన అధినేత.. సమన్వయంతో పని చేసి అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ మన ఓటుతో మన కళ్లల్లోనే పొడిపించాలని చూస్తోంది: కేసీఆర్
ముఖ్య నేతల ప్రత్యేక సమావేశాలు..: కేసీఆర్‌తో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలూ పలువురితో విడివిడిగా భేటీ అవుతూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. పలువురు ముఖ్య నేతలు, యువత, ఆసరా పింఛనుదారులు, మహిళలు, తదితరులతో సమావేశమవుతూ వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఇటీవల నిరుద్యోగ యువత, మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
హోం మంత్రి మహమూద్ అలీ సహా ఇతర మైనార్టీ నేతలతో కలిసి ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించిన కేటీఆర్.. మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన లబ్ధిని వివరించారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మైనారిటీ నేతలతో భేటీ అయ్యారు. ఇదే తరహా సమావేశాలను జిల్లా స్థాయిలలోనూ నిర్వహిస్తూ స్థానికంగా ఆయా వర్గాల ఓటర్లను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు - తెలంగాణలో మాత్రం నీటి పన్ను లేదు : కేసీఆర్
ఐదు విభాగాలుగా ఓటర్ల వర్గీకరణ..: బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోనూ ఓటర్లను ఐదు విభాగాలుగా విభజించింది. గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్లను ఐదు విభాగాలుగా గుర్తించి.. ఏయే వార్డుల్లో ఏ విభాగానికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయనే జాబితాను రూపొందించింది. భారత్ రాష్ట్ర సమితి అభిమానులు, కార్యకర్తలు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొంది కచ్చితంగా తమకే ఓటు వేస్తారనుకునే వారిని 'సానుకూల'వర్గంగా పేర్కొంది. పార్టీ అభిమానులుగా ఉండి, పలు కారణాలతో అభ్యర్థి పట్ల 'అసంతృప్తి'గా ఉన్న వారిని రెండోవర్గంగా తేల్చింది.
ఇక 'ప్రతిపక్ష' పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు మూడో వర్గంగా.. ఏ పార్టీలతోనూ సంబంధం లేకపోయినా ప్రభుత్వం పట్ల 'వ్యతిరేకత'తో ఉన్నవారు నాలుగో వర్గంగా.. ఇవన్నీ కాకుండా తమ ఓటును ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని 'తటస్థ' ఓటర్లు ఐదో వర్గంగా విభజించినట్లు సమాచారం. ఇందులో 'ప్రతిపక్ష' ఓటర్లు ఎలాగూ తమకు ఓటు వేయరు కనుక వారిపై దృష్టి పెట్టడం లేదు. మిగిలిన 'అసంతృప్తి', 'తటస్థ', 'వ్యతిరేక' కేటగిరీల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉండదు : కేసీఆర్