CM KCR MEETING WITH FARMER UNIONS LEADERS: వనరులను సరిగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి చేసి.. రైతు, వ్యవసాయం, సంక్షేమం దిశగా సాగే సుపరిపాలన కోసం అడుగులు వేయాల్సి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కర్షక సంఘాల నేతలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వ్యవసాయం, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించిన నేతలు.. క్షేత్రస్థాయి పరిశీలనకు డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి రైతు సంక్షేమ పథకాలుంటే ఎంతో అభివృద్ధి చెందేవారమని సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు, తమ రాష్ట్రాల్లోని రైతుల గురించీ ఆలోచన చేస్తే బాగుంటుందని వారు ఆకాంక్షించారు.
అది దురదృష్టకరం..: అనంతరం రైతు సంఘాల నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడకుండా ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి కారణాలు అన్వేషించాలన్నారు. స్వాతంత్య్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాతా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలు, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా ఎందుకు పోరాటాలకు సిద్ధపడుతున్నారో ఆలోచించాల్సి ఉందని చెప్పారు. దేశంలోని రైతు సమస్యలకు ఎందుకు పరిష్కారం దొరకడం లేదో.. దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన వారు.. నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వారిని పాలకులే ఇబ్బందులకు గురిచేసే విధానం దేశంలో కొనసాగుతుండటం మన దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రజాసంక్షేమం కోరుకునే శక్తులంతా సంఘటితం కావాల్సి ఉందని తెలిపారు. అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందని వివరించారు.
రాష్ట్రం ఇస్తుంటే.. కేంద్రం ఎందుకివ్వదు..: అమెరికా, చైనా వంటి ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయయోగ్య భూమి, మానవ వనరులు భారత్‌లోనే పుష్కలంగా ఉన్నాయని సీఎం వివరించారు. దేశంలోని 40 వేల కోట్ల ఎకరాల సాగుయోగ్యమైన భూమికి 40 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరమని.. తాగునీటికి 10 వేల టీఎంసీలైతే సరిపోతాయని పునరుద్ఘాటించారు. 70 వేల టీఎంసీల నీటి వనరులు దేశంలో అందుబాటులో ఉన్నా ఎందుకు సాగు, తాగునీరు కోసం ప్రజలు ఇంకా ఎదురు చూడాల్సి వస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 2 లక్షల మెగావాట్లు వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రైతులందరికీ ఉచితంగా విద్యుత్, సాగునీరు అందిస్తున్నా కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయట్లేదని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి రాష్ట్రంలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్‌లు ఉన్నాయా అని నిలదీశారు. విద్యుత్ ఉండి, కష్టపడే రైతులున్నా దేశంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, కేంద్ర పాలకుల నిర్లక్ష్యం వంటి విషయాలను విశ్లేషించుకొని, చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి.. కేసీఆర్ లాంటి సీఎం మాకూ ఉంటే బాగుండేదంటున్న ఆ రాష్ట్రాల రైతులు