TRS Rajyasabha Candidates: రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై తెరాస కసరత్తు కొలిక్కివచ్చింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈనెల19తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో నేడు లేదా రేపు అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారు. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికలకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఒకేసారి ముగ్గురు పేర్లనా లేక తొలుత ఒకరి పేరే ప్రకటిస్తారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. మూడుస్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మూడుస్థానాల కోసం సుమారు పది మందికి పైగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమకాలం నుంచి పార్టీకి విధేయలుగా ఉన్నామని కొందరు కేసీఆర్‌పై నమ్మకంతో ఇతర పార్టీలని వీడి తెరాసలో చేరామని మరికొందరు ఆశలు పెట్టుకున్నారు. సీఎంకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చని.. ఆయన వయసును దృష్టిలో ఉంచుకొని కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చుననే భిన్న ప్రచారాలు సాగుతున్నాయి. గతంలో పలు సందర్భాల్లో వినిపించిన పారిశ్రామివేత్త, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర్ రావు, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డి పేర్లు మరోసారి ప్రచారంలోకి వచ్చాయి.
సామాజిక సమీకరణాలతో పాటు భవిష్యత్ రాజకీయాలను కేసీఆర్ పరిగణనలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. జాతీయరాజకీయాలపై దృష్టిపెట్టిన కేసీఆర్.. దిల్లీలోఅవసరాలు, ఇతరపార్టీలతో సంబంధాలను బేరీజు వేయవచ్చునని తెరాస శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. దిల్లీ అవసరాల కోణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేరు పరిశీలించవచ్చునని పార్టీ వర్గాల అంచనా. కేసీఆర్, కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ ఇటీవల ముంబయి పర్యటనలో ప్రత్యక్షమైన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ పేరు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయి రైతు కార్మిక, బీసీ, ఎస్సీ, మైనార్టీ నేతల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు చర్చసాగుతోంది. చాలాకాలంగా పదవులు లేని సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు కొందరు విశ్రాంత అధికారుల పేర్లను పరిశీలించవచ్చునని తెలుస్తోంది. తెరాసలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి వంటి నేతలు పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. పదవుల భర్తీలో ప్రతిసారి అంచనాలకు అందని విధంగా అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించే కేసీఆర్... రాజ్యసభ టికెట్లలోనూ ప్రచారానికి భిన్నంగా వ్యవహరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీలో సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇవీ చదవండి: