CM KCR Comments on BRS Agenda : దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా.. కేంద్ర పాలకులు అవే మూస ధోరణులను అవలంబిస్తున్నారని, దార్శనికత లేకపోవడం కారణంగా దేశంలో జరగాల్సినంత అభివృద్ధి లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అపారమైన సహజ వనరులను వినియోగించుకోవడం చేతకాని దేశ పాలకులు.. మహిళలు, రైతులు, యువత, వృత్తి కులాలు వంటి సంపద సృష్టించే అపూర్వమైన మానవ వనరులను కూడా సరైన పంథాలో వినియోగించుకోలేక పోతున్నారని విమర్శించారు. సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతూ.. దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో, విభిన్నమైన ఆలోచనలతో పాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.
CM KCR Comments at Maharashtra Leaders Joinings : మహారాష్ట్ర నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేసీఆర్... గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరికల సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... 'దేశంలో నీరు, బొగ్గు సహా అవసరాలకు మించి సహజ సంపద నిల్వలున్నాయి. వాటిని సరైన రీతిలో వినియోగించుకోవడం చేతగాక ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు కేంద్ర పాలకులు కారణమవుతున్నారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులకే ఓట్లేసుకుంటూ ఇంకెన్నాళ్లు గెలిపించుకుందాం? కుల, మతాలకు అతీతంగా ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీని, నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన చైతన్యం ప్రజల్లో మరింతగా రావాల్సి ఉందన్నారు. ఈదిశగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాల్సిన అవసరముంది' అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధి : దేశ పాలకుల ఆలోచనల్లో మార్పు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఆ దిశగా సమూల మార్పు జరగాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మకంగా దేశాభివృద్ధి సాధ్యమౌతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ రోజురోజుకూ వృద్ధి చెందుతుందన్న విషయమై మహారాష్ట్ర నేతలు కేసీఆర్‌తో చర్చించారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ఏకోన్ముఖంగా ముందుకు సాగుతామని వారు ఉత్సాహంగా తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన పలువురు మరాఠా ప్రముఖులు : పార్టీలో చేరిన వారిలో.. పుణె జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్.టి.సావంత్, దక్షిణ ముంబయి ఎన్సీపీ అధ్యక్షుడు మానవ్ వెంకటేశ్, సీబీఐలో పనిచేసి పదవీ విరమణ పొందిన లక్ష్మణ్‌రాజ్ సనప్, క్రీడాకారుడు నిలేశ్ మధుకర్ రాణే, జడ్పీ మెంబర్ భగవాన్ సనప్, నాగ్పూర్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ సామాజిక సేవకుడు డా.కిరణ్ వైద్య, ఉత్తమ్రావు వాగ్, మహారాష్ట్ర ఎంబీటీ అధ్యక్షుడు అజర్ అహ్మద్, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఘనశ్యామ్ బాపూ హక్కే, పహిల్వాన్ అప్పాసాహెబ్ అరేన, ఎంపీగా పోటీ చేసిన సంతోష్ బిచుక్లే, ప్రకాశ్ సాహురావు బోసాలె, తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ బీబీ పాటిల్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :