CM KCR at IAMC Inauguration: దేశంలోనే తొలి ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నానక్‌రామ్‌గూడలోని ఫొనిక్స్ వీకే టవర్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని (ఐఏఎంసీ) సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఐఏఎంసీలో ఏర్పాట్లను పరిశీలించారు. ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐకు అప్పగించిన కేసీఆర్.. వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
చాలా చాలా వ్యవహరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా.. కొన్నిసార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు మించి హైదరాబాద్ పురోగమిస్తోంది. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోంది. హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలామంది కృషిచేశారు. హైదరాబాద్‌ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి సీజేఐ జస్టిస్ రమణ. ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ జస్టిస్ రమణ కీలకపాత్ర పోషించారు. ఐఏఎంసీ... దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తుంది. హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేసి.. ఇక్కడే ఉన్నత శిఖరాలను అధిరోహించిన జస్టిస్ రమణ.. తన రూట్స్‌ను ఎప్పుడు మరిచిపోలేదు. ఆయన కృషితోనే ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది.
-సీఎం కేసీఆర్
రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు తీసుకొస్తామన్నారు. ఇంత మంచి ఉత్తమమైన సెంటర్ ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అనేక విషయాలకు గ్లోబల్ డెష్టినేషన్ కాబోతుందని.. దానిలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.
International Center for Arbitration and Mediation Hyderabad : దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్‌లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఫొనిక్స్ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగుల్లో ఈ కేంద్రం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: CJI at IAMC Hyderabad Inauguration : 'రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర'