City Police Focus On Drugs Mafia: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) నుంచి గంజాయి.. దిల్లీ, గోవా ద్వారా కొకైన్, హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్.. చేరుతుండడం ద్వారా హైదరాబాద్ మత్తు మాఫియాకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు తరలివెళ్తోంది. ఇటీవల మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలతో స్మగ్లర్ల ఆగడాలకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. కొత్త సంవత్సర వేడుకలు దగ్గర పడటంతో కొకైన్, ఎల్‌ఎస్‌డీ, గంజాయిని భారీగా కొనుగోలు చేసేందుకు ఈవెంట్ నిర్వాహకులు స్మగ్లర్లతో మంతనాలు ప్రారంభించారు. గంజాయి గ్రాము ధర రూ.1500-1600, కొకైన్ గ్రాము ధర రూ.14-18వేలు, హ్యాషిష్ ఆయిల్ లీటరు రూ.3-3.5లక్షలు పలుకుతుంది. పార్టీల్లో ఉపయోగించే టాబ్లెట్ రూపంలో ఉండే సింథటిక్ డ్రగ్స్ ఒక్కోకటి రూ.4వేలు పోసి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. డిసెంబరు 31, జనవరి 1 రెండ్రోజుల వ్యవధిలోనే సుమారు రూ.200-300 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
ఎంతైనా కుమ్మరిస్తారట..
హైదరాబాద్.. పార్టీ సంస్కృతికి కేరాఫ్ చిరునామా. ఒక్కో పార్టీకి రూ.15-20 లక్షల వరకూ ఖర్చు చేస్తారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ వంటివి దొరకనప్పుడు గంజాయి వినియోగిస్తున్నారు. నార్కోటిక్ కంట్రోల్ సెల్ ద్వారా స్మగర్లు, విక్రయదారులు, కొనుగోలుదారులపై నిఘా పెంచారు. మత్తుపదార్థాల రవాణాపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సమాచారం అందిస్తూ పోలీసులకు సహకరిస్తుండటంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 100 మందిపై పీడీయాక్ట్ అమలు చేశారు. మహానగరంలో మత్తు రవాణా చేస్తే ఏడాదిపాటు జైలు ఖాయమనే హెచ్చరికను పంపారు.
కాలుపెడితే జైలుకే...
ఏవోబీ, విశాఖ ఏజెన్సీ నుంచి రోడ్డుమార్గంలో గంజాయి ఇక్కడకు చేరుతుంది. స్మగ్లర్లు చాలా తెలివిగా సరిహద్దు దాటుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వెళ్లేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. మత్తుపదార్థాల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. డీఆర్‌ఐ అధికారులతో సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించటం కలిసొచ్చింది. కేసులు నమోదు, దర్యాప్తు, ఆధారాల సేకరణతో నిందితులకు జైలుశిక్షలు పడేలా చేస్తున్నాం. కొత్త సంవత్సర వేడుకలపై నిఘా ఉంచాం.ఇప్పటికే తెలంగాణ పోలీసులకు చిక్కితే పీడీయాక్ట్ తప్పదనే భయం అంతరాష్ట్ర ముఠాల్లో నెలకొంది. - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
వేడుకలే లక్ష్యంగా విక్రయాలు...
కొత్త సంవత్సరం వేడుకలు లక్ష్యంగా మాదకద్రవ్యాలు విక్రయించేందుకు స్మగర్లు సిద్ధమవుతున్నారు. ఫామ్‌హౌస్‌ల్లో రేవ్‌పార్టీల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఎస్‌వోటీ, నార్కొటిక్ కంట్రోల్ సెల్, పోలీసులు, అబ్కారీ సమన్వయంతో మత్తుపదార్థాల సరఫరాపై నిఘా ఉంచాం. - ఎం.స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
ఇదీ చదవండి: Liquor Sales Telangana 2021 : ఇది తెలంగాణ మందుబాబుల ఆల్‌టైం రికార్డ్!