సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరమని సినీనటుడు అక్కినేని నాగార్జున (Cine Hero Nagarjuna) అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన నవ్వుల్ని దంత వైద్యుడు డా.అట్లూరి మోహన్ (Doctor A.Mohan) అందంగా ఉంచుతున్నారని ఆయన చెప్పారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ మోహన్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన సాయి డెంటల్ క్లినిక్ (Sai Dental Clinic) నూతన శాఖను సతీమణి అమలతో కలిసి నాగ్ ప్రారంభించారు.
తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు దంత సమస్య కోసం సుల్తాన్ బజార్లో ఉండే పద్మశ్రీ ఎంఎస్ నారాయణను సంప్రదించేవాడినని.. చాకొలెట్లు తింటే వచ్చే పుప్పిపళ్లకు నొప్పి లేకుండా చికిత్స చేసేవారని నాగార్జున (Cine Hero Nagarjuna) గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు మోహనే తనతో పాటు వందల మంది సినీ నటులకు దంత వైద్యునిగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో సేవల్ని విస్తరించాలని కోరుకుంటున్నానన్నారు.
'డాక్టర్ మోహన్.. రెండోది సాయి క్లినిక్ ఓపెన్ చేశాడు. దానికి కూడా మంచి సక్సెస్ వస్తుందని తెలుసు. డాక్టర్ మోహన్ వాళ్ల నాన్న డాక్టర్ నారాయణ నాకు పదేళ్ల వయసు అప్పటి నుంచి పరిచయం. చాక్లెట్స్ తిని పళ్లు సరిగ్గా కడుక్కొకుండా ఉంటే కెవిటీస్ వచ్చేవి. అప్పుడు అమ్మ డాక్టర్ నారాయణ దగ్గరకు పంపించేది. డాక్టర్ నారాయణ సర్వీస్ ఓరియంటేషన్ మనిషి. అమెరికాలో ఉన్న ఆయన హైదరాబాద్ వచ్చి సర్వీస్ చేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. వాళ్ల నాన్న అడుగుజాడల్లో డాక్టర్ మోహన్ నడుస్తున్నారు. సరికొత్త టెక్నాలజీ, కొత్త వైద్య విధానాలతో మోహన్ రాణిస్తున్నారు. డాక్టర్ మోహన్ నా సినిమాలు చూసి బాగుందో లేదో చెప్పడం కాదు... నీ పళ్లు కొంచెం సెట్ చేయాలి.. పాలిష్ చేయాలి క్లినిక్ రా అని చెప్పేవాడు. నా చిరునవ్వుల వెనుక ఉన్నది డాక్టర్ మోహన్.'
- నాగార్జున, సినీనటుడు
భవిష్యత్ మొత్తం డిజిటల్ డెంటిస్రీదేనని.. అధునాతన సాంకేతికత ద్వారా ఒక్కసారి ఆసుపత్రిని సందర్శిస్తే సమస్య పరిష్కారమయ్యేలా చికిత్స అందుతుందని డాక్టర్ మోహన్ తెలిపారు. వేలాది మందికి అందమైన చిరునవ్వులనందించే బాధ్యత గత 55 ఏళ్లుగా చేపడుతున్నామని చెప్పారు.