CM KCR Review on Crop Loss : రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానంగా వర్షాలకు జరిగిన పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.. తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. దానిని తక్షణమే అమలు చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.
గృహలక్ష్మికి విధివిధానాలు రూపొందించాలి..: ఖాళీ జాగాలు కలిగి ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు లెక్కన ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
త్వరలోనే పోడు పట్టాల పంపిణీ..: రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న సీఎం కేసీఆర్.. అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా 4 లక్షల ఎకరాలకు చెందిన లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు.. పాస్ పుస్తకాలు ముద్రించి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు.
రాములోరి కల్యాణానికి రూ.కోటి మంజూరు.: శ్రీ రామనవమి సందర్భంగా ఈ నెల 30న జరగనున్న భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ నిర్వహణ కోసం సీఎం తన ప్రత్యేక నిధి నుంచి రూ.కోటి మంజూరు చేశారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా భద్రాచల దేవస్థానం ఆదాయాన్ని కోల్పోయిందన్న దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న సీఎం కేసీఆర్.. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి..
హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది: మంత్రి కేటీఆర్
'మాతా, శిశు మరణాల తగ్గింపులో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది'