మిషన్ కాకతీయ తరువాత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం చెక్‌డ్యాంల నిర్మాణం (Check dams construction). ఉపనదులు, వాగుల ప్రవాహాలను ఆపి, నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది ప్రభుత్వం ఈ నిర్మాణాలకు అనుమతులిచ్చింది. కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో మొదటి విడతగా 638 చెక్‌డ్యాంలను మంజూరు చేసింది. 593 నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పూర్తయినవి, పనులు దాదాపు పూర్తికావచ్చిన డ్యాంలలో కొన్ని వరదలకు కొట్టుకుపోతుండడం గమనార్హం.
రూ.2847.71 కోట్ల పనులు
ప్రభుత్వం 91 నియోజకవర్గాల్లో 596 చెక్‌డ్యాంలకు టెండర్లు పిలిచింది. మొత్తం రూ.2847.71 కోట్లు కేటాయించింది. చిన్న వాగులపై చేపట్టే నిర్మాణాలకు కనిష్ఠంగా రూ.రెండున్నర లక్షలు, పెద్ద వాగులు, ఉప నదులపై కట్టడాలకు గరిష్ఠంగా రూ.11 కోట్లు కేటాయించింది. పలు జిల్లాల్లో నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పోటీపడి టెండర్లు సాధించారు. చాలా చోట్ల అంచనా కన్నా తక్కువకు (లెస్) టెండర్లు దక్కించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో అనుకూలురకు టెండర్లు దక్కలేదని... టెండర్లను రద్దు చేయించేందుకు కొందరు ప్రయత్నించారు. కొన్ని పనుల్లో విజయం సాధించారు. చివరికి నిర్మాణాలు వరదల పాలవుతుండటంతో విమర్శలు రేగుతున్నాయి.
అన్నిచోట్లా డిజైన్ల లోపం
ఉపనది లేదా వాగు ప్రవాహ ప్రాంతం, వరద ఉద్ధృతి, నీటి నిల్వ, ముంపు.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చెక్‌డ్యాంలు నిర్మించాల్సి ఉంది. ఎక్కడికక్కడే ప్రత్యేక డిజైన్ చేయాల్సి ఉండగా, ఆలస్యమవుతుందన్న సాకుతో గంపగుత్తగా ఒకే డిజైన్ అమలు చేశారు. కొన్ని జిల్లాల్లో సీఈలు ప్రత్యేక దృష్టి పెట్టి డిజైన్లను సరిచేశారు. కొన్నిచోట్ల మాత్రం మమ అనిపిస్తున్నారు. పనులు వరదార్పణం కావడానికి ఇదే ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
* కట్ట (సిస్టర్న్) ఎత్తు, వెడల్పు, నిర్మాణంలో వినియోగించాల్సిన మెటల్స్‌లో లోపాలు ఉన్నాయి. ప్రవాహం ఉద్ధృతిని బట్టి మార్పుచేర్పులు చేయాల్సి ఉన్నా పాటించలేదు. కొన్నిచోట్ల డ్యాం అడుగు భాగం నుంచి నీరు చొచ్చుకు వెళ్లి కుంగిపోతున్నాయి.
* ఇరువైపులా గట్ల వద్ద ప్రవాహాన్ని అంచనా వేసి రెండు వైపులా గోడలు (వింగ్ వాల్స్), మట్టి కట్టలు నిర్మించాలి. వీటిలోనూ లోపాలు ఉండటంతో వరదతో ఇరువైపులా గట్లు కోతకు గురవుతున్నాయి.
ఒక్కవానకు.. రెండు ముక్కలైంది
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని మానేరు వాగుపై చెక్‌డ్యాం నాసిరకంగా నిర్మించడంతో ఇలా రెండు ముక్కలైంది. రూ.14.46 కోట్లకు టెండరు నిర్వహించగా ‘లెస్’ టెండర్‌తో రూ.10.93 కోట్లకే గుత్తేదారు దక్కించుకున్నారు. ప్రవాహానికి అనుగుణంగా ఆకృతి (డిజైన్) లేకపోవడం ప్రధాన లోపం. ఇటీవల తొలిసారి వచ్చిన వరదలకు డ్యాం మధ్యభాగం రెండుగా విడిపోగా.. రెండోసారి వచ్చిన వరదకు రెండు వైపులా గోడల పక్కన మట్టి భారీగా కోతకు గురైంది. ఒకవైపు గోడ
మధ్యలో నెర్రెలిచ్చింది.
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోర గ్రామ సమీపంలో కప్పలవాగుపై రూ.5.75 కోట్లతో నిర్మించిన ఈ చెక్‌డ్యాం కట్ట వరదకు కొట్టుకుపోయింది. ఇరువైపులా వింగ్ వాల్స్ పక్కన మట్టి కోతకు గురైంది. డ్యాంలో నాణ్యత, డిజైన్‌లో లోపాలు కనిపిస్తున్నాయి. వాగు విస్తీర్ణం మేరకు రెండువైపులా గోడలు కట్టాల్సి ఉండగా, వాగు లోపలి భాగంలోనే నిర్మించారు.
భద్రాద్రి జిల్లా గుండాల-మణుగూరు మార్గంలో మల్లన్నవాగుపై ఈ ఏడాదే నిర్మించిన చెక్‌డ్యాం ఇది. ఇటీవల వచ్చిన వరదకు రెండు వైపులా కోతకు గురైంది. వాగు ఉద్ధృతిని అంచనా వేయకుండా రెండువైపులా గట్లను కలుపుతూ డ్యాం పూర్తిచేసేశారు. ఇప్పుడు వింగ్ వాల్స్‌కు ముప్పు ఏర్పడి మొత్తం నిర్మాణమే ప్రమాదంలో పడింది.
ఇదీ చూడండి: SARANGAPUR PUMP HOUSE: సర్జ్‌పూల్ నుంచి లీకేజీలే కారణమా? వరదొచ్చిన ప్రతిసారీ మునక తప్పదా!