వైకాపా నేతల అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడటం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైకాపా నేతల అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై వైకాపా పార్టీ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజా సంపదను దోచుకుంటుంటే ప్రజల తరఫున అడ్డుకోవడం తప్పా? అంటూ ప్రశ్నించారు. ఒక్కరిపై వంద మంది వైకాపా గూండాలు దాడి చేయడమనేది పిరికిపంద చర్య అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు ఫోనులో దేవినేని ఉమాతో మాట్లాడారు. మీకు యావత్తు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ధైర్యంగా పోరాడాలని సూచించారు.
మళ్లీ అధికారంలోకి రాలేమనే దోచుకునే ప్రయత్నం...:
ఏపీ సీఎం జగన్‌రెడ్డి చేతగాని పాలనతో భవిష్యత్తులో వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నేతలకు అర్థమైంది. అందుకే అధికారం ఉండగానే అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలనూ వదలడం లేదు. వైకాపా నేతల అరాచకాలు, దురాగతాలకు రానున్న రోజుల్లో చక్రవడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదు - చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత.
అవినీతికి అడ్డుగా ఉన్నారని అంతమొందించే కుట్ర
వైకాపా అవినీతికి అడ్డుగా ఉన్నారనే కక్షతో దేవినేని ఉమామహేశ్వరరావును జగన్‌రెడ్డి, సజ్జలరెడ్డిలు అంతమొందించేందుకు కుట్రపన్నారు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగింది. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదు. మాజీ మంత్రికే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? దాడికి పాల్పడిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనతోపాటు డీజీపీ కార్యాలయం ముందుకు నిరసనకు దిగుతాం.
- అచ్చెన్నాయుడు. తెదేపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు.
డీజీపీకి లేఖ:
దేవినేని కారుపై రాళ్లు రువ్విన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
‘గత రెండేళ్లలో ఏపీ మాఫియాకు అడ్డాగా మారింది. వైకాపా నేతలు ఒక వర్గం పోలీసులతో కుమ్మక్కై అసమ్మతి స్వరాన్ని.. బెదిరింపులతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలు సమాచారం ఇచ్చిన తర్వాత సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో దాడి జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం. ఇప్పటికైనా ఏపీలో శాంతిభద్రతలను కాపాడేలా డీజీపీ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
సంబంధిత కథనం: devineni arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్