దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల సౌకర్యార్థం... "వన్ నేషన్ - వన్ కార్డ్" విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు... దేశంలో ఎక్కడ నుంచైనా నిత్యావసర వస్తువులు తీసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లోని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద ఏపీలోని విజయవాడ, గుజరాత్, మహారాష్ట్రలలో కూడా ఈ సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ ఆదర్శనగర్ కాలనీ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద గల చౌక ధరల దుకాణంలో ఈ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్... దిల్లీ నుంచి ఆన్లైన్లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దృశ్య మాధ్యమ సమీక్ష ద్వారా అధికారులు, డీలర్లు, కార్డుదారులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. 2017 ఏప్రిల్ నుంచి తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న పోర్టబులిటీ విధానంపై కమిషనర్... కేంద్ర మంత్రికి వివరించారు.
మంచి స్పందన వస్తోంది
తెలంగాణలో ఈ విధానానికి మంచి స్పందన లభిస్తున్నదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. నేషనల్ ఫోర్టబులిటీ తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. వ్యవసాయం, ఇతర ఉపాధి పనులు ఉన్న సమయాల్లో ఇతర రాష్ట్రాల వాసులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా నిత్యావసర సరుకులు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం