కరోనా వైరస్ కొంత సమయం వరకు గాలిలో వ్యాపించి ఉంటుందనే అనుమానాలు నిజమయ్యాయి. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు మొదటిసారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్ సూక్ష్మ కణాలు వ్యాపిస్తున్నాయని.. అవి రెండు గంటల కంటే ఎక్కువ సేపు గాలిలో ఉంటున్నాయని పరిశోధనలో వెల్లడైంది. వైరస్ లోడును బట్టి ఇది ఆధారపడి ఉన్నట్లు గుర్తించారు. ఒక గదిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, వారి రోగ లక్షణాలు, ఎంతసేపు అక్కడ ఉన్నారనే దానిపై వ్యాప్తి ఆధారపడి ఉందని పరిశోధకులు తేల్చారు.
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (ఐఎంటెక్) శాస్త్రవేత్తలు సెప్టెంబరు-నవంబరు నెలల్లో ఈ పరిశోధన చేపట్టారు. హైదరాబాద్‌లోని మూడు, మొహాలీలోని మూడు ఆసుపత్రుల నుంచి ప్రత్యేక యంత్రాల ద్వారా గాలి నమూనాలను సేకరించారు. కొవిడ్ వార్డులు, ఐసీయూలు, కొవిడేతర వార్డులు, డాక్టర్ గదులు, వరండా, ఓపీ కారిడార్లు, మార్చురీ.. ఇలా వివిధచోట్ల నుంచి నమూనాలు సేకరించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 41 నమూనాలు సేకరించి ఆర్‌టీ-పీసీఆర్‌పై పరీక్షించగా వైరస్ ఉనికి ఉన్నట్లు తేలింది.
* ఒక గదిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు రెండు గంటల కంటే ఎక్కువ సమయం గడిపినప్పుడు వారు కూర్చునే ప్రదేశం నుంచి 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్ గాలిలో వ్యాపించి ఉన్నట్లు తేలింది.
* ఎలాంటి లక్షణాలు లేని కొవిడ్ రోగి ఫ్యాను, ఏసీ లేని గదిలో ఉన్నా వైరస్ ఎక్కువ దూరం వ్యాప్తి చెందలేదని గుర్తించారు.
మాస్క్‌తో వ్యాప్తిని అరికట్టవచ్చు..
గాలిలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నా ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలతోనే దాని వ్యాప్తిని నిరోధించవచ్చని పరిశోధనలో పాల్గొన్న ఐఎంటెక్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ ఖోస్లా తెలిపారు. ప్రధానంగా మాస్క్ ధరించడం సామాజిక టీకాగా పనిచేస్తుందన్నారు. చేతులు కలపకపోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం అవసరమన్నారు.
కొవిడ్ వార్డుల్లోనే వైరస్ ఆనవాళ్లు
కొవిడ్ వార్డుల్లో తప్ప సాధారణ వార్డుల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. తొలిదశలో ఆసుపత్రుల్లోనూ రెండోదశలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇళ్లు, ప్రజామరుగుదొడ్లలోనూ గాలి నమూనాలు సేకరించి పరిశోధించాం. మలం ద్వారా వైరస్ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను కొన్నాళ్లు వాడకపోవడం మంచిది. వాటిలోకి వెళ్లినా మాస్క్ తీయొద్దు. మూడో దశలో మెట్రో, సినిమా హాళ్లు, రద్దీ ప్రాంతాల్లో అధ్యయనం చేస్తాం. -రాకేశ్ మిశ్రా, సీసీఎంబీ డైరెక్టర్
వైద్య సిబ్బందికి ఎన్-95 మాస్క్ మేలు
మూసి ఉన్న గదులు, కొవిడ్ ఐసీయూ వార్డుల్లోని గాలిలోనే వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో తేలింది. ఆసుపత్రి సిబ్బంది, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు దగ్గరగా ఉండేవారు ఎన్-95 మాస్క్ ధరించడం సురక్షితం. సాధారణ మాస్క్ వల్ల రక్షణ తక్కువ. కొవిడ్ ఆసుపత్రుల కారిడార్‌లోనూ వైరస్ వ్యాప్తి కనిపించలేదు. బహిరంగ ప్రదేశాల్లో ఆరు అడుగుల దూరం పాటిస్తే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. -డాక్టర్ కృష్ణారెడ్డి, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు