CBI notices to Kadapa MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. నోటీసులను వాట్సప్ ద్వారా సీబీఐ అధికారులు పంపారు. ఈనెల 24న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్‌రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప లేదా హైదరాబాద్ ఎక్కడికి వస్తారో చెప్పాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి గతనెలలో సీబీఐ ముందు హాజరయ్యారు. ఆయన కాల్ డేటా నుంచి హత్య విషయంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు సంస్థ ఆరా తీసింది. హైదరాబాద్ కేంద్రీయ సదన్‌లో ఉన్న సీబీఐ కార్యాలయంలో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం ఆయనను విచారించి కీలక విషయాలు సేకరించారు. దిల్లీ సీబీఐ ఎస్‌సీ-3 విభాగం ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని బృందం అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది. మొదట విచారణకు సహకరిస్తానని అవినాష్‌రెడ్డి తెలిపారు. కానీ తన న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆయన కోరగా అందుకు సీబీఐ నిరాకరించింది. దీంతో ఆయన ఒక్కరే కార్యాలయంలోకి వెళ్లారు.
Viveka murder case update: వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్ కేటాయించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరి, శివశంకర్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అటు అధికారపక్షం, ప్రతిపక్ష నేతలు.. ఈ కేసు గురించి పలుమార్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అధికార పార్టీలోని నేతలే ఈ కేసులో ప్రధాన నిందితులని విపక్ష నేతలు పలుమార్లు ఆరోపించారు. మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు పంపడంతో ఈ కేసు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి:
వివేకా హత్య కేసు.. అవినాష్ కాల్‌డేటాపై సీబీఐ ఆరా?
వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు