నకిలీ ఇంజినీరింగ్ పట్టాలతో అమెరికాకు వెళ్తున్న అక్రమార్కుల సంఖ్య క్రమంగా పెరుతోంది. అమెరికాకు నకిలీ వీసాలతో వెళ్లిన వారిలో 11 మందిని 3 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల వ్యవధిలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు 56 మంది కన్సల్టెంట్లు, విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం అమెరికాను ఎంచుకుంటున్న అక్రమార్కులు.. తొలుత ఎంఎస్ చదివేందుకు.. తర్వాత అక్కడే ఉద్యోగం చేసేందుకు వీలుగా లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ అక్రమాలపై దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. దీనిపై కూపీలాగిన దిల్లీ పోలీసులు.. అక్రమ పద్ధతుల్లో అమెరికాకు వెళ్లిన 20 మందిని కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు.
నకిలీ వీసా వ్యవహారంపై ఈ నెల 10న హైదరాబాద్ వచ్చిన దిల్లీ పోలీసులు.. చైతన్యపురిలోని ఐ-20 అబ్రోడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని కపిల్‌ను.. అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కి చెందిన ఓ విద్యార్థి ఉద్యోగం చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని 4, గుంటూరులో రెండు కన్సల్టెన్సీలకు సంబంధించిన ఏజెంట్లను, వారి నుంచి సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నకలీ సర్టిఫికెట్లతో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిపైనా.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కన్సల్టెన్సీలపై దృష్టి పెట్టారు.
నకిలీ పట్టాలు తయారు చేస్తున్న కన్సల్టెన్సీ నిర్వాహకులకు... కొన్ని వర్సిటీల్లోని కిందిస్థాయి అధికారులు, ఆచార్యులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని వర్సీటీల నకిలీ పట్టాలు తయారు చేస్తున్నారు. కొందరు నిందితులకు అమెరికా, బ్రిటన్, స్కాట్‌లాండ్‌లోని విదేశీ వర్సిటీలతో ఒప్పందాలున్నాయని పోలీసులు గుర్తించారు. పట్టాలు తయారు చేసేప్పుడు ఆయా సంవత్సరాల్లో ఉపకులపతులుగా ఎవరున్నారని తెలుసుకుని.. వారి పేర్లు, సంతకాలు అచ్చు గుద్దేస్తున్నారు. అర్హతలు లేకుండా విదేశాల్లో చదివేందుకు వెళ్లేవారి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీల్లో తక్కువ మార్కులు వచ్చిన వారి మార్కుల జాబితాల్లో.. ఎక్కువ మార్కులు దిద్దేందుకు రూ.2 లక్షల వరకు తీసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్ నుంచి నకిలీ పట్టాలతో వెళ్లిన విద్యార్థులు అమెరికాలో చదువుకుంటుండగా... 400 మంది వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనులు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి:
Foreign Jobs: అడ్డదారిలో విదేశీ కొలువులకు అమెరికన్ ఎంబసీ బ్రేక్
యూపీలో యోగి మార్క్ పాలన.. 'ఏ ఫైలూ మూడ్రోజులకు మించి పెండింగ్‌లో ఉండొద్దు'