Groundwater Level in Telangana: మిషన్ కాకతీయ పథకం అమలుతో తెలంగాణలో భూగర్భ జలమట్టం పెరిగినట్లు కాగ్ పేర్కొంది. భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణ అంశంపై పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘‘రాష్ట్రంలోని 46,530 చెరువులను పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2014-15లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రభావం గురించి తెలుసుకోవడానికి అత్యధిక భూగర్భజలాలు వినియోగించే 9 ప్రాంతాల్లో మదింపుచేశాం. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగినట్లు తేలింది. అక్కడ 2012-13లో 10 టీఎంసీల మేర భూగర్భ జలాలు ఉండగా 2016-17 నాటికి 11.4 టీఎంసీలకు చేరాయి. ఈ పథకం అమలుచేసిన తర్వాత భూగర్భ జలాలు అధికంగా వాడే (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) బేసిన్‌ల కేటగిరీని ‘క్రిటికల్’ కిందికి మార్చారు అని పేర్కొంది.
చట్టవిరుద్ధంగా బోర్లు
తెలంగాణలో కొన్నిచోట్ల ‘వాల్టా’ నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసినట్లు కాగ్ తెలిపింది. 2017-18లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 471, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 609 బోర్లు వేసినట్లు పేర్కొంది. వాల్టా మార్గదర్శకాల ప్రకారం 120 మీటర్ల లోతు వరకే బోర్లు వేయాల్సి ఉన్నా 128 బోర్లను 122 నుంచి 150 మీటర్ల వరకు వేశారని పేర్కొంది. అధికారుల అనుమతి తీసుకొనే బోర్లు వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆమోదయోగ్యం కాదని వివరించింది.
భూగర్భజలాలు తోడేస్తున్న ప్లాంట్లు
నిజామాబాద్‌లో 2017 మార్చిలో పరిశీలన జరిపినప్పుడు 46 వాటర్ ప్లాంట్లు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భూగర్భజలాలను తోడేస్తున్నట్లు కనిపించిందని కాగ్ తెలిపింది. 2018 అక్టోబరులో మూడు ప్లాంట్లను పరిశీలించినప్పుడు అనధికారికంగా నీరు వాడుకుంటున్నటు రూఢీ అయిందని పేర్కొంది. హైదరాబాద్‌లో 283 ప్లాంట్లు ఇదే తరహాలో నడుస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి వీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కాగ్ ఆక్షేపించింది.
ఇదీ చూడండి: 29 జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం