సుదీర్ఘ కసరత్తు అనంతరం రాష్ట్ర కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. ఆరుగురి ప్రమాణస్వీకారంతో బెర్తులన్నీ నిండిపోయాయి. విస్తరణలో సామాజిక వర్గాలు, ప్రాంతాలు, అనుభవం, విధేయతలకు ప్రాధాన్యమిచ్చారు ముఖ్యమంత్రి. నలుగురు ఓసీలు, ఒక బీసీ, ఒక ఎస్టీకి చోటు దక్కింది.
ఎవరికి... ఏ శాఖ అంటే
హరీశ్‌రావుకు ఆర్థికశాఖ, కేటీఆర్‌కు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు, సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణాశాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ, సత్యవతి రాఠోడ్‌కు గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖలను కేటాయించారు.
అన్ని వర్గాలకు స్థానం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మహిళలకు స్థానం లభించింది. మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు. ఉమ్మడి జిల్లాలన్నింటికీ స్థానం లభించగా.. కరీంనగర్ జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.
మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలు
ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామని... విస్తరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు స్థానం ఉంటుందని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని విస్తరణలో నిలబెట్టుకున్నారు. సామాజిక వర్గాల సమీకరణాలు పలువురికి కలిసొచ్చాయి. మహిళా, ఎస్టీ కోటా రెండు భర్తీ చేసే ఉద్దేశంతో సత్యవతి రాఠోడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
కమ్మ, కాపు వర్గాలకు..
ఖమ్మం జిల్లాతోపాటు కమ్మ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు లేకపోవడం వల్ల.. ఆ సమీకరణాలు పువ్వాడ అజయ్‌కి అనుకూలమయ్యాయి. జోగు రామన్నకు మంత్రివర్గంలో స్థానం కల్పించక పోవడంతో... మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన గంగుల కమలాకర్‌కు కలిసొచ్చింది.
కొత్త వారు ముగ్గురు...
విస్తరణలో చోటు దక్కిన ఆరుగురిలో ముగ్గురు కొత్త వారు కాగా.. మరో ముగ్గురు అనుభవజ్ఞులు ఉన్నారు. కొన్నాళ్లుగా ప్రచారం జరిగినట్లుగానే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మళ్లీ కేబినెట్లో చేరారు. హరీశ్ రావుకు మంత్రి పదవిపై రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ... అనుభవం, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా మళ్లీ కేసీఆర్ జట్టులో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన సబితా ఇంద్రారెడ్డికి ఆమెకు ఇచ్చిన హామీ మేరకు.. మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
మొత్తం 18 మంత్రులు
సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. మొత్తం మీద కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిసి 18 మంది ఉండగా.. అందులో సగం కొత్త వారు.. మరో సగం గత అనుభవం ఉన్న వారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్ మొదటి సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు కాగా.. కేసీఆర్‌తో పాటు.. హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి అనుభవజ్ఞులుగా ఉన్నారు.
ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్