BRS mlc leaders complaint to DGP: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చివేసిన తప్పులేదని మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ములుగు జిల్లా కేంద్రంలో ప్రగతిభవన్‌ను పేల్చేయాలని వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శంబీపూర్ రాజు, ఎల్.రమణ, దండే విఠల్, ఎగ్గే మల్లేశంలు డీజీపీ అంజన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లోక్‌సభ స్పీకర్‌కు కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో అభివృద్ది పనులపై కూడా అయన తప్పుగా మాట్లాడారని మండిపడ్డారు. ములుగులో గిరిజన యూనివర్శిటీపై కూడా వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. వర్శిటీపై పార్లమెంట్‌లో మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాదని బ్లాక్ మెయిలర్‌ను పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారని విమర్శించారు.
ములుగు జిల్లా ఏర్పడటానికి ముఖ్య కారణం కేసీఆర్. ఆ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటిస్తూ కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ములుగు జిల్లాలో ఏర్పాటుకావాల్సిన గిరిజన యూనివర్సిటీ కోసం పార్లమెంట్‌లో మాట్లాడాలి. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చివేసిన తప్పులేదని మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాదని బ్లాక్ మెయిలర్‌ను పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చిన చందంగా మారింది. -పల్లా రాజేశ్వర్ రెడ్డి
రేవంత్‌రెడ్డి నిన్న ములుగు జిల్లాలో పాదయాత్రలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లోకి పేదలకు ప్రవేశమే లేదని అన్నారు. అలాంటి ప్రగతి భవన్ ఎందుకని మండిపడ్డారు. ఆనాడు గడీలను నక్సలైట్లు గ్రైనెడ్లతో పేల్చేవారని, ఇప్పుడు బాంబులతో ప్రగతి భవన్‌ను పేల్చి వేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుందని అన్నారు.
ఇవీ చదవండి: