IND VS AUS Bumrah Wife Post Viral : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అతడి సతీమణి సంజనా గణేషన్ ప్రశంసలు కురిపించింది. తన భర్త గొప్ప బౌలర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పొగిడిన ఆమె, బుమ్రా గురించి ఫన్నీగా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎందుకు పెట్టిందంటే? - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతోంది భారత్. పెర్త్ వేదికగా నవంబర్ 23న ప్రారంభమైన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా అదిరే ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండటం వల్ల, తాత్కలిక కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించాడు. ఓ వైపు కెప్టెన్‌గా, మరోవైపు బౌలర్‌గా అదరగొట్టాడు బుమ్రా. నాలుగు వికెట్లతో చెలరేగాడు.
అసలే స్వదేశం, విదేశం అని తేడా లేకుండా, పిచ్ ఎలా ఉన్నా సరే, బుమ్రా బంతి అందుకున్నాడంటే బ్యాటర్లలో వణుకు మొదలైపోతుంది. స్పిన్నర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన టీమ్ ఇండియాలో ఇలాంటి పేసర్ ఉండటం ఇతర జట్లకు మింగుడు పడని విషయమనే చెప్పాలి! పేసర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన దేశాల్లో, ఆతిథ్య జట్టు బౌలర్లను మించి పిచ్‌లను ఉపయోగించుకోవడం బుమ్రాకే సాధ్యం. భారత బ్యాటర్లను దెబ్బ కొట్టేందుకు తమ పిచ్‌ను పేస్‌కు మరీ అనుకూలంగా తీర్చిదిద్దితే, అసలుకే మోసం వస్తుందని బుమ్రా విషయంలో విదేశీ జట్లు భయపడుతుంటాయి. అయినా పెర్త్‌లో ఆస్ట్రేలియా అదే తప్పు చేసింది. పేస్ పిచ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసినప్పటికీ, ఆ తర్వాత బుమ్రాతో పొంచి ఉన్న ముప్పును మాత్రం ఊహించలేకపోయింది. దీంతో అతడిని ఎదుర్కోవడానికి ఆసీస్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
బుమ్రా బౌలింగ్ దెబ్బకు ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) పెవిలియన్ చేరారు. దీంతో బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై డీలా పడ్డ భారత జట్టులో, బుమ్రా తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్‌గా మరింత బాధ్యతలో బౌలింగ్ చేసిన అతడు, తొలి రోజు ముగిసే సమయానికి జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు.
మొత్తంగా ముగ్గురు పేసర్లతోనే 27 ఓవర్లు వేయించిన బుమ్రా కెప్టెన్‌గా ముందుండి వికెట్లు కూడా తీశాడు. అతడి ఫీల్డ్ సెటప్ కూడా అద్భుతంగా ఉంది. దీంతో బుమ్రాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఏమని ప్రశంసించిందంటే? - ఈ క్రమంలోనే అతడి సతీమణి సంజనా గణేషన్ కూడా ఇన్‌స్టా స్టోరీలో బుమ్రాను ప్రశంసించింది. అలానే ఈ పోస్ట్‌లో అతడి పిరుదల గురించి కూడా ప్రస్తావిస్తూ నవ్వులు పూయించింది. 'బుమ్రా గొప్ప బౌలర్. అతడి పిరుదులు కూడా' అని రాసుకొచ్చింది. అలానే బుమ్రా ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్ దెబ్బకు ఆసీస్ చెత్త రికార్డ్ రిపీట్ - 40ఏళ్లలో ఇది రెండోసారి
'హే పంత్ వేలంలో ఏ ఫ్రాంఛైజీకి వెళ్తున్నావ్?' - రిషభ్ రిప్లై ఇదే