BRS MLA Candidates List Telangana 2023 : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 21న తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్(CM KCR) ఈనెల 20న సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని గులాబిదళం భావిస్తున్నారు.
BRS MLA Tickets Telangana 2023 : ఇలానే 2018 శాసనసభ ఎన్నిక(Telangana Assembly Election 2023)ల్లో 105 మంది అభ్యర్థులను ప్రకటించి.. సంచలనం సృష్టించారు. అయితే ఈసారి మొదటి విడతలో అంతమంది అభ్యర్థులను ప్రకటించకపోయినా.. సుమారు 87 నియోజకవర్గాల అభ్యర్థులను(BRS MLA Candidates List) ప్రకటించే అవకాశం ఉంది. అన్ని స్థానాలకూ ప్రకటించేస్తే పూర్తిస్థాయిలో ఎన్నికలబరిలోకి దిగవచ్చని, ఎవరైనా వెనకబడితే మార్చుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
BRS Strategy for Telangana Assembly Elections 2023 : ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అభ్యర్థులెవరినీ మార్చకపోవచ్చని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒక్కరికే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి వచ్చి చేరే ఓ నాయకుడికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు సర్వేల తర్వాత అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
BRS MLA Candidates Warangal 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి రెండు మార్పులకే అవకాశం ఉంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ లేదా ఆయన కుమార్తె, మహబూబాబాద్ ఎంపీ కవిత.. ఇద్దరిలో ఎవరో ఒకరు అనే ప్రచారం జరిగినా చివరకు రెడ్యానాయక్‌నే పోటీ చేయించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మహబూబాబాద్‌లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ లేదా మంత్రి సత్యవతి రాథో(Minister Satyavathi Rathod)డ్‌లలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. వీరిలో సత్యవతి రాథోడ్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగామలో ఇప్పుడున్న ఎమ్మెల్యేను మార్చితే.. ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి ఇవ్వాలి.. వీరిలో పల్లాకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్న.. స్పష్టత కోసం మరో రెండు రోజులు వేచి ఉండాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక స్థానం మాత్రమే మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
BRS MLA Candidates in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై చర్చలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య కుమార్తె అనూరాధ పేరు తెరపైకి వచ్చింది. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన హరిప్రియ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఈ సారి ఇల్లందు అభ్యర్థిని మార్చాలని కొన్నాళ్ల క్రితమే బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రత్యామ్నాయం చూసినప్పుడు ఆ జిల్లా నాయకులు గుమ్మడి అనూరాధ పేరు సూచించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు సీఎంతో సమావేశమైనప్పుడు ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికే చెందిన జిల్లా పరిషత్ ఛైర్మన్ కనకయ్య కాంగ్రెస్‌లో చేరి.. అసెంబ్లీ బరిలోకి దిగనున్నందున కొత్త అభ్యర్థి కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.
కేసీఆర్ ఈసారి కూడా గజ్వేల్ నుంచే పోటీ? : వైరా నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది తర్వాత బీఆర్ఎస్లో చేరిన రాములునాయక్‌ను ఈ ఎన్నికల్లో మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి మదన్‌లాల్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిని మార్చడం ఖాయం కాగా.. రెండో స్థానంలో మార్పు కోసం అభ్యర్థుల ప్రకటన నాటికి స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది మంది వరకు బీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థులుండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోస్థానంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఆయన గజ్వేల్ నుంచి మాత్రమే పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TS MLA's Court Case : ఎన్నికల వివాదాల కేసులు... ఆందోళనలో ప్రజాప్రతినిధులు