BRS Contest in Maharashtra Local Bodies తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ... భారత్ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. మొదటిసారి వేరే రాష్ట్రంలో పోటీకి అధికార పార్టీ ముహూర్తం ఫిక్స్ చేసింది. అది ఏ రాష్ట్రమో కాదు... మహారాష్ట్ర. అయితే అక్కడ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనిని బీఆర్ఎస్ ఉపయోగించుకోనుంది. అందులో పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేష్‌లతో పాటు ఇతర రాష్ట్రాల నేతలతో ఆదివారం, సోమవారం భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి మరోసారి కేసీఆర్ ఆ నేతలతో మాట్లాడి... సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో మహారాష్ట్రలోని జడ్పీ మెంబర్ (జడ్పీటీసీ), పంచాయతీ సమితి మెంబర్ (ఎంపీటీసీ) ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో ఒక పంచాయతీ సమితి పరిధిలో ముగ్గురు వరకు జడ్పీటీసీలు, ఆరుగురు వరకు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో అన్ని చోట్లా పోటీకి దిగాలని చర్చించినట్లు తెలుస్తోంది. జడ్పీ ఛైర్మన్‌ను జడ్పీటీసీలే ఎన్నుకోనుండటంతో ఈ ఎన్నికలను కీలకంగా తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ జిల్లాల ఇన్‌ఛార్జులుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని పెట్టనున్నారు. ఆదిలాబాద్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని యావత్మాల్, వార్దా, వాసిం జిల్లాలకు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే జోగు రామాన్న, మాజీ ఎంపీ గోడం నగేష్‌లు ఇన్‌ఛార్జ్‌లుగా ఉంటారు. ఆ మూడు జిల్లాల్లో వీరు ఇద్దరు కలిసి పర్యటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు చంద్రపుర్, గడ్చిరోలి జిల్లాల బాధ్యతలను కేసీఆర్ అప్పగించారని సమాచారం.
ఇంతకుముందు ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యత అప్పగించాలని భావించారు. అయినా... చివరకు రెండు, మూడు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, పురాణం సతీష్‌ల సేవలను ఉపయోగించుకోనున్నారు. వీరికి ఒక్కో జిల్లా బాధ్యతలు ఇవ్వగా... మార్చి 8 వ తేదీన హోలీ పండగ అనంతరం బీఆర్‌ఎస్ నేతలు మహారాష్ట్రలో విస్తృతంగా టూర్లు చేపట్టనున్నట్లు సమాచారం. గ్రామస్థాయి నాయకులను పార్టీలో చేర్పించనున్నారని తెలుస్తోంది తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలకు వివరించాలని ప్రత్యేక ప్రణాళిక రచించరని సమాచారం.
ఇవీ చదవండి: