BRS Candidates List Telangana Elections 2023 : రానున్న శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై దాదాపు కసరత్తు పూర్తిచేసిన బీఆర్ఎస్ అధిష్ఠానం.. ముందుగానే నాయకులను సన్నద్ధం చేస్తోంది. అత్యధిక ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో.. ఇతర పార్టీ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరిన వారున్న చోట.. మొదటి నుంచీ పార్టీలో ఉంటూ టికెట్ కోసం పోటీపడుతున్న వారిని అధిష్ఠానం పిలిపించి మాట్లాడుతోంది. మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే వారికి ఇతరత్రా అవకాశం కల్పిస్తామని.. నచ్చజెప్పి ఒప్పించే పనిలో కొన్నాళ్లుగా అధినాయకత్వం నిమగ్నమైంది. మొదటి విడత.. అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.
BRS Strategy for Telangana Assembly Elections 2023 : టికెట్‌కు అవకాశం లేనివారిలో అసంతృప్తి తలెత్తకుండా.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao) తదితరులు ముందుగా మాట్లాడి తర్వాత అవసరాన్ని బట్టి.. సీఎం కేసీఆర్(CM KCR)తో మాట్లాడిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులతో... ఇటీవల ఇలాగే చర్చించి వారిని పార్టీ మారకుండా చూసినట్లు తెలిసింది. ఇలా సర్దిచెప్పే ప్రయత్నాలు.. ఎక్కువ నియోజకవర్గాల్లో సఫలీకృతమైనట్లు.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుజ్జగించినా ఆయా నాయకుల్లో మార్పు రాకుంటే.. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులపై ప్రభావం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
హస్తానికి ధీటుగా బరిలోకి : కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు బలమైన అభ్యర్థులుండి.. వారు విజయం సాధించే అవకాశం ఉందని భావించే నియోజకవర్గాలపై కూడా... బీఆర్ఎస్ గట్టిగా దృష్టి సారించింది. భద్రాచలం నుంచి గత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ తరఫున పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన తెల్లం వెంకట్రావు.. ఇటీవల పొంగులేటితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వెంకట్రావుతో సంప్రదింపులు జరిపారు. ఆయన.. మళ్లీ బీఆర్ఎస్(BRS Party)లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇది పొంగులేటి(Ponguleti Srinivas Reddy)పై.. ప్రభావం చూపడంతోపాటు విజయావకాశాలున్న గట్టి అభ్యర్థిని బరిలోకి దించడానికి ఆస్కారం ఏర్పడిందని, బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
Telangana Assembly Elections 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. బీఆర్ఎస్ ఇద్దరు సిట్టింగులను మార్చే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గానికి గట్టి అభ్యర్థి ఉండగా.., ఇంకో నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన.. ఓ నాయకుడిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తున్నా.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పార్టీ తరఫున గెలిచి.. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలున్నచోట.., పార్టీలోనే ఇద్దరు నాయకులు పోటీపడుతున్న చోట కూడా సమస్యను సామరస్యంగా పరిష్కరించే.. ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడైన ఓ ఎమ్మెల్సీకి.. పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు.. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే.. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర నియోజకవర్గాల్లో పోటాపోటీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి ఉండగా.., ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను రెండో విడతలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కలిసే పోటీ చేస్తాం: మునుగోడు ఉప ఎన్నిక తర్వాత.. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా.. వామపక్ష నాయకులు ప్రకటించారు. భద్రాచలం, మిర్యాలగూడ, మునుగోడు, బెల్లంపల్లిలలో చెరొక స్థానాన్ని వామపక్షాలకు కేటాయించే అవకాశం ఉందని.. అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భద్రాచలంలో తెల్లం వెంకట్రావు మాదిరే, ఇల్లెందులో కూడా కాంగ్రెస్‌లో చేరిన నాయకుడిని వెనక్కు రప్పించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో.. బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు అవకాశాలపై అంతర్మథనం జరుగుతోంది.