BRS Assembly Elections Campaign Strategy 2023 : ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ పార్టీ పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తోంది. సభలు, ర్యాలీల వంటి సంప్రదాయ విధానాలతో పాటు.. కొత్త పద్ధతులనూ అనుసరిస్తోంది. బీఆర్ఎస్ గత ఎన్నికల వ్యూహాల్లో లేని విధంగా.. ఈసారి సుమారు 350 మందితో వార్ రూమ్‌లకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రస్థాయిలో కేటీఆర్, హరీశ్‌రావు పర్యవేక్షణలో తెలంగాణ భవన్‌లో సెంట్రల్ వార్ రూమ్ ఉంటుంది. నియోజకవర్గం ఇంచార్జీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 119 వార్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అందులో పొలిటికల్, మీడియా, క్రైసిస్ మేనేజ్‌మెంట్ సభ్యులను నియమించారు. వార్ రూమ్ ప్రతినిధులతో కేటీఆర్, హరీశ్‌రావు ఆదివారం సమావేశమై.. పోలింగ్ ముగిసే వరకు ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. ప్రజల మూడ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. దానికి అనుగుణంగా వ్యూహాల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు.
"తాజాగా మూడు సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. అన్నింటిలో బీఆర్ఎస్కు 70 నుంచి 80 స్థానాలు వస్తాయని ఉంది. కేసీఆర్ తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. పార్టీకి ఓటు వేసే ప్రతి ఓటరుని ఓటింగ్‌కు వచ్చే విధంగా ఎలాంటి వ్యూహాలు అవలంభించాలో ఎలా ముందుకు వెళ్లాలో అందరం కూర్చోని మాట్లాడాం. నాకు బలమైన నమ్మకం ఉంది. నవంబరు 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది." - కేటీ రామారావు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కేంద్ర, నియోజకవర్గ స్థాయి వార్ రూమ్‌ల మధ్య నిరంతర సమాచార మార్పిడి, సమన్వయం ఉండేలా ప్రణాళిక చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను, ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తెప్పించుకొని.. విశ్లేషించి కేటీఆర్, హరీశ్‌రావు ఎప్పటికప్పుడు తగిన సూచనలు దిశానిర్దేశం చేస్తారు. మీడియా కమిటీ నేతృత్వంలో ప్రతీ గ్రామం, వార్డు, డివిజన్‌కు ఒకటి లేదా రెండు వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేయనున్నారు. రోజూ మీడియా సమావేశాలు, ప్రకటనల ద్వారా పార్టీ విధానాలు, హామీలను ప్రచారం చేస్తారు. ఇతర పార్టీల అభ్యర్థులు మాట్లాడుతున్న అంశాలను రాష్ట్రస్థాయి వార్ రూమ్‌కు పంపిస్తే.. కౌంటర్‌గా ఏయే విషయాలను ప్రధానంగా ప్రస్తావించాలో వ్యూహాలు నిర్దేశిస్తారు.
BRS War Rooms for Election Campaign : నియోజకవర్గంలోని సొంత పార్టీ, ఇతర పార్టీల నేతల కదలికలను పొలిటికల్ కమిటీ పరిశీలించి.. రాష్ట్రస్థాయి వార్ రూమ్‌కు సమాచారం ఇస్తుంది. పార్టీలోని ఎవరైనా నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలిస్తే.. ఏం చేయాలో కేంద్ర కమిటీ నిర్దేశిస్తుంది. ఎలా బుజ్జగించాలి.. ఎంతమేరకు హామీ ఇవ్వాలో చెప్పడంతో పాటు అవసరమైతే రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగుతారు. అదేవిధంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న ఇతర పార్టీల నేతలనూ ఆకర్షిస్తారు. ప్రచారంలో ఎవరెవరు చురుగ్గా పాల్గొంటున్నారు.. స్తబ్దుగా ఎవరుంటున్నారో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు చేశారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా అప్రమత్తం చేసేందుకు వార్ రూమ్‌లో క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీనీ ఏర్పాటు చేశారు.
వార్ రూమ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచార వ్యూహాలను మార్చుకునేలా బీఆర్ఎస్ ప్రణాళికలు చేసింది. ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించింది. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానాలు, కచ్చితంగా ఓటు వేస్తారనుకునే వారిని ఏ కేటగిరీలో... ఇంకా తేల్చుకోని తటస్థ ఓటర్లను బీ కేటగిరీగా... ఇతర పార్టీల కార్యకర్తలు, తమకు ఓటు వేయరనుకునే వారిని సీ కేటగిరీగా విభజించారు. ఇందులో తటస్థ ఓటర్లపై బీఆర్ఎస్ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని బహుముఖ వ్యూహాలతో.. పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాటు చేసింది. ఓ వైపు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు.. కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలు.. మరోవైపు అభ్యర్థి, స్థానిక నేతల ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు చేశారు. మేనిఫెస్టో ఆశించిన విధంగా ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. దానిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
Social Media Platforms For Campaign For BRS : ప్రచారంలో సామాజిక మాధ్యమాన్ని ప్రధాన అస్త్రంగా వాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కొత్త, యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో సోషల్ మీడియా కీలకమని గులాబీ పార్టీ బలంగా నమ్ముతోంది. అభ్యర్థితో పాటు.. నేతలందరూ వ్యక్తిగతంగా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్ తెరిచి చురుగ్గా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కారు గుర్తు నిరంతరం ప్రజల మనసుల్లో కదిలేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కార్యకర్తలు, నేతలందరూ చొక్కాపై కారు గుర్తు పెట్టుకోవాలని నిర్ణయించింది.