Boyaguda Incident: సికింద్రాబాద్ బోయిగూడ అగ్నిప్రమాద ఘటనలో సజీవ దహనమైన 11 మంది బిహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. మృతదేహాలకు నిన్ననే గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడి మార్చురీలో భద్రపరిచారు.
ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక అంబులెన్స్‌ల్లో మృతదేహాలను తరలించారు. అక్కడి నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో పట్నా తీసుకెళ్లారు. పట్నా చేరుకున్న అనంతరం కతిహార్, చాప్రా జిల్లాల్లోని వారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించనున్నారు.
ఇదీ జరిగింది...
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తుక్కు గోదాములో మంటలు చెలరేగి.. పైనున్న టింబర్ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో కొంత మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది పొగతో ఊపిరాడక చనిపోయారు.
ఇదీ చదవండి: Fire Accident in Timber Depot : టింబర్ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి