కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న బొల్లారం వంద పడకల ఆసుపత్రిని హైదరాబాద్ ఎయిమ్స్ (బీబీనగర్) బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మెంబర్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ నేతృత్వంలో... స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు.
నిధుల సమస్య వల్ల ఈ ఆసుపత్రిని రక్షణ శాఖ స్వయంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. దీనితో ఈ వంద పడకల ఆసపత్రి నిర్వహణ బాధ్యతలను ఎయిమ్స్(బీబీనగర్)కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అందులో భాగంగానే వినోద్ కుమార్, బండ ప్రకాష్, సాయన్న, మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో అజిత్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ నాయర్, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా, డీన్ డాక్టర్ నీరజ్ అగర్వాల్ తదితరులు రక్షణ శాఖకు చెందిన వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు
బ్రిటిష్ కాలం నాటి ఆసుపత్రిని ఎన్నో ఏళ్ళుగా స్థానిక ప్రజలకు సేవలను అందించిన ఈ కేంద్రం ఐదు ఎకరాల్లో స్థలంలో అధునాతన ఆస్పత్రి భవనాన్ని, వైద్యుల నివాసాలను 2016లో రక్షణ శాఖ నిర్మించింది. రాజీవ్ రహదారికి చేరువలో ఉండటంతో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలకు అత్యవసర మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిమ్స్ (బీబీనగర్) ఆధ్వర్యంలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఆస్పత్రులను నిర్వహించాల్సి ఉండగా, అర్బన్ ప్రాంత ఆస్పత్రిని బొల్లారం రక్షణ శాఖ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమవుతోంది. కాగా ఎయిమ్స్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.