BJP Muralidhar Rao comments on KCR: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భాజపా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవినీతి అంశంలో జైలుకు పంపడం ఖాయమని మురళీధర్ రావు జోస్యం చెప్పారు. కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించారు. కనుమరుగైన పార్టీలతో కలిసి కేసీఆర్ భాజపాను ఏమీ చేయగలుగుతారని ప్రశ్నించారు.
అయోమయంలో కాంగ్రెస్
అవినీతి చేసిన వాళ్లు ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేననని మురళీధర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందన్న ఆయన.. పార్టీకి ప్రజల్లో బలం పెరిగినప్పుడు అభ్యర్థుల సమస్య ఉత్పన్నం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పోటీలోనే లేదని.. పార్టీలోని పంచాయితీలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నియమించుకునే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు.
రాజకీయ దురుద్దేశం
అంతకుముందుగా ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన పరిణామాలపై మురళీధర్.. ఆ రాష్ట్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే పంజాబ్ సర్కారు.. ప్రధాని భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం, ఆ రాష్ట్ర సీఎం కలిసి పన్నాగం పన్నారని విమర్శించారు. ప్రధాని భద్రతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. ప్రధాని భద్రతపై ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రధాని భద్రత, దేశ సరిహద్దు విషయంలో భాజపా ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదని గుర్తు చేసుకున్నారు.
'పర్యటనలో భాగంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతం పలకాలి. కానీ పంజాబ్ పర్యటనలో ఏ ఒక్కరూ కూడా ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే చేశారు. పంజాబ్ సర్కారుతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నింది. గతంలో ప్రధాని భద్రత, దేశ సరిహద్దు విషయంలో భాజపా ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదు.' -- మురళీధర్ రావు, భాజపా సీనియర్ నేత
ఇదీ చదవండి: 'ఎవరికి బలిసింది సార్.. మీరు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?'