బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ గురించి ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో ప్రస్తావించడం పట్ల భాజపా మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ పనితీరు, ఉత్పత్తి అయ్యే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వినూత్న ఆలోచనతో ఐఐసీటీ ఆధునాతన పరిజ్ఞానంతో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం శుభ పరిణామమని అన్నారు. బయోగ్యాస్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. రెండు కోట్లు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం పది టన్నుల కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ శక్తి అవసరాలను తీరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి భాజపా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, భాజపా కంటోన్మెంట్ నాయకుడు భానుక మల్లికార్జున్, జంపన ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.