BJP Reaction on CM KCR Speech : ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ముఖ్యమంత్రులు చేసిన విమర్శలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. దేశంలో ఏ లక్ష్యం లేకుండా పనిచేస్తున్నఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
రాజకీయ విమర్శల పేరుతో కేసీఆర్ దేశాన్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. 4,500 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు తెలంగాణకు కేంద్రం మంజూరుచేస్తే వాటిని బస్తీ దవాఖానాలుగా పేరు మార్చారని తెలిపారు. వీటి నిర్వహణకు కూడా కేంద్రమే డబ్బులు ఇస్తోందని స్పష్టం చేశారు. భారాస పేరుతో కేసీఆర్ చేస్తున్న నేలవిడిచి సామును చూసి జనం నవ్వుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
BJP Reaction on CM KCR Speech in Khammam BRS Meeting : కేసీఆర్ దిల్లీకి రావడానికి ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ కాబోతోందని, తెలంగాణ నుంచి ప్రజలు తరిమేస్తారని భయపడిన కేసీఆర్ ప్రధానమంత్రి కుర్చీ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేసీఆర్ విమర్శిస్తున్నట్లు దేశం ప్రమాదంలో లేదని.. కల్వకుంట్ల కుటుంబంతో తెలంగాణ ప్రమాదంలో ఉందన్నారు. కొవిడ్ సమయంలో ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, టీకాలు కూడా దేశంలోనే తయారు చేసుకున్నామన్నారు.
కేసీఆర్ తిట్లే ప్రధానికి ఆశీర్వాదాలు: జల వివాదాల పరిష్కార సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలిస్తే వాటికి కేసీఆర్ డుమ్మా కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఏపీ, తెలంగాణ) దావత్‌లు చేసుకుంటారని, అలానే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రైవేటీకరించకుంటే ఆ భారమంతా ప్రజలపైన పడుతుందన్నారు. అందుకే ఎయిర్‌ఇండియా వంటి వాటిని ప్రైవేటుపరం చేశామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్ తిట్లే ప్రధానికి ఆశీర్వాదాలన్నారు. ఈ నెల 24న మహబూబ్‌నగర్‌లో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
నెల జీతం లేదు కానీ దేశాన్ని ఎలా పాలిస్తాడు : ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని పాలిస్తానంటే... దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ విమర్శించారు. ఖమ్మం సభలో ఏం మాట్లాడాలో అర్థంకాక సమయం అయిపోయిందని హెలీకాప్టర్‌తో సమస్య అంటూ మధ్యలో అనడం ప్రజల దృష్టి మళ్లించడమేనని.. అరుణ వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ తెలంగాణాకే దిక్కులేకుంటే... దేశమంతా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు ప్రధాని పదవిపై కలలు కనడంలోనే ఆయన నిజస్వరూపం బయటపడిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు.
ఇవీ చదవండి: