BJP High Command Serious on TS Leaders : దక్షిణాదిన పాగావేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయిన కమలనాథులకు.. తెలంగాణలో ప్రతికూల వాతావరణం నెలకొంది. అక్కడ హస్తం పార్టీ విజయం సాధించడంతో.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీలో భారీగా చేరికలుంటాయని భావించినా.. కర్ణాటక ఫలితాలతో పూర్తిగా తలకిందులైంది.
Etela Rajender Sensational Comments : బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. కాషాయతీర్థం పుచ్చుకుంటారని భావించినా ఆ పరిస్థితి లేకుండాపోయింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేసిన ప్రయత్నాలు విఫలం కాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెనుదుమారం రేపుతున్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉందని.. ఆ ఇద్దరు బీజేపీలోకి రావడం కష్టమేనని చెప్పడంతో శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.
BJP High Command is Angry with TS Leaders : ఈటల వ్యాఖ్యలతో బీజేపీలో చేరికలుండవని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. నాయకులు ఎవ్వరూ పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు చేరికల సంగతి పక్కనపెడితే.. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలువురు కమలంను వీడుతున్నారని.. సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు బహాటంగానే విమర్శలు చేస్తున్నారు.
మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేయకపోవడంపై ప్రజల్లో.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న సంకేతం వెళ్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కవితను అరెస్ట్ చేయకపోతే ఆ ప్రభావం పార్టీపైన పడుతుందని.. భారత్ రాష్ట్ర సమితిని ఎదుర్కొవడం కష్టమేనన్న భావనను వ్యక్తంచేస్తున్నారు. అలాంటప్పుడు ఇందులో కొనసాగడం వ్యర్థమని అభిప్రాయపడుతున్నారు. కొందరు నేతలు కాంగ్రెస్ చేరుతారని ప్రచారం సాగినా వారు ఖండించారు. నాయకులు పార్టీని వీడబోమని చెప్పినా జాతీయ నాయకత్వంతో పాటు.. రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరు బీజేపీని వీడినా.. ఆ ప్రభావం తీవ్రంగా పడుతుందని భావిస్తోంది.
బండి సంజయ్‌పై విమర్శలు : మరోవైపు బండి సంజయ్ తీరును.. సొంతపార్టీ నేతలే తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఈటల వర్గం.. ఏకంగా పలుమార్లు బహిరంగంగానే పార్టీ అధ్యక్షుడిపైనే విమర్శలు చేశారు. కవితపై.. సంజయ్ వ్యాఖ్యలను.. ఎంపీ అర్వింద్ తప్పుపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నాయకత్వంలో పనిచేసేందుకు.. ఇతర పార్టీల నుంచి ఎవ్వరూ రావట్లేదని ఈటల వర్గం అమిత్ షా, నడ్డా వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన : అధిష్టానం మాత్రం బండి సంజయ్‌ని మార్చే ప్రసక్తే లేదని.. 2024వరకు కొనసాగుతారని స్పష్టంచేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు డైలమాలో పడ్డారు. రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో వారంతా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చదవండి : KishanReddy Respond to Change of BJP President : 'తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు'
Etela Rajender Respond TS BJP President Post : 'బండి సంజయ్ మార్పు.. ఉండకపోవచ్చు'