ETV Bharat / state

సైబర్​ మోసగాళ్లతో తస్మాత్​ జాగ్రత్త...! - సామాజిక మాధ్యమాల్లో సైబర్​ మోసగాళ్ల ఎర

కరోనా మహమ్మారి వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. కాలక్షేపం కోసం పిల్లలు, పెద్దలు అందరూ అంతర్జాలన్ని విరివిగా వాడుతున్నారు. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు.. నయా మోసాలకు తెరతీశారు. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామని ప్రకటనలు జారీ చేస్తూ... అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ విధంగా వినియోగదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. అపరిచిత కాల్స్‌కు స్పందించకపోవడం, వ్యక్తిగత వివరాలు చెప్పకుండా ఉండటం వల్ల సైబర్‌ నేరస్థుల వలలో చిక్కుకోకుండా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Beware With Cyber Cheaters and Criminals
సైబర్​ మోసగాళ్లతో తస్మాత్​ జాగ్రత్త...!
author img

By

Published : May 1, 2020, 5:41 PM IST

ప్రపంచాన్ని గడగలాడిస్తోన్న కరోనా వైరస్‌ కట్టడికి... ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లకుండా ప్రభుత్వం అంక్షలు విధించడంతో... అత్యవసరమైతే తప్ప గడప దాటట్లేదు. గత 5 వారాలుగా చాలామంది... టీవీలు, కంప్యూటర్లకే అతుక్కుపోతుండటం వల్ల... సాధారణ రోజులతో పోలిస్తే అంతర్జాల వినియోగం మూడురెట్లు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అంతర్జాల వినియోగదారుల్ని ఆకర్షించేలా... సైబర్‌ నేరగాళ్లు ప్రకటనలు జారీ చేస్తున్నారు. వివిధ సంస్థల పేరిట ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వీటిని నమ్మి... అమాయకులు మోసపోతున్నారు. వైరస్ సోకుతుందనే భయంతో కొందరు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. యూపీఐ, వాలెట్లు అప్‌డేట్ చేసుకోవాలని సదరు సంస్థల పేరిట లింకులు పంపిస్తూ.... వారి ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. వాహనాలు, ఇతర ఖరీదైన వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తామంటూ ప్రకటనలిస్తున్న సైబర్ నేరగాళ్లు... అడ్వాన్స్​గా కొంత మొత్తం చెల్లించాలని చెప్పి, ఆ తర్వాత డబ్బులు తీసుకొని ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు.

కరోనా వైరస్ నియంత్రణ కోసం భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం, చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలని.. ప్రభుత్వాలు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వాటికి గిరాకీ పెరగడంతో... కొన్నిచోట్ల ఆ వస్తువులు లభించని పరిస్థితి నెలకొంది. దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్-95 మాస్క్​లు, శానిటైజర్లు... సరసమైన ధరలకే విక్రయిస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. వాటిని నమ్మిఫోన్‌ చేస్తే బ్యాంకులో కొంతడబ్బు జమచేస్తే... ఆర్డర్‌ తీసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రోజులు గడుస్తున్నా ఆర్డర్‌ చేసిన వస్తువులు రాకపోవడం వల్ల సదరు నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విఛ్చాప్‌ అని వస్తోంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు... సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నెల రోజులుగా సీసీఎస్​లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జంటనగరాలకు చెందిన పలువురు... సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించారు.

గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంక్​ అధికారులు ఎప్పుడూ ఓటీపీ వివరాలు అడగరని... ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకుఖాతాకు సంబంధించిన వివరాలు ఏవరికీ చెప్పొద్దని పోలీసులు వివరించారు.

ఇవీ చూడండి : ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్​ఎంసీలోనే

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.