రాష్ట్రంలో ఫీజులు వసూలు కాక ఆర్థికంగా కుదేలవుతున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు తమ విద్యాసంస్థలను అమ్మకానికి పెడుతున్నాయి. ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నా ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో వాటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అద్దెలు కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. కార్పొరేట్, ఎక్కువ శాఖలతో బడా యాజమాన్యాల కింద ఉన్నవి ఎలాగోలా నెట్టుకొస్తున్నా బడ్జెట్ పాఠశాలలు ఈ పరిస్థితిని తట్టుకుని నిలబడటం కష్టసాధ్యమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ జోన్ పరిధిలోనే సుమారు 30 పాఠశాలలు అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. శేరిలింగంపల్లిలోని ఐదు పాఠశాలలు అమ్మకానికి పెడితే ఒక్కటే చేతులు మారింది.
అద్దెతోపాటు, ఆస్తిపన్ను, నీటి, విద్యుత్తు బిల్లులు, స్కూల్ బస్సుల ఈఎంఐలు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి వేతనాలు..ఇలా ఆర్థికంగా తీవ్ర భారం మోయాల్సి వస్తోంది. అందుకే కొందరు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్ సంఘం నేత వి.ఫణికుమార్ పేర్కొన్నారు. ‘కొన్నిచోట్ల అమ్మేందుకు సిద్ధమైనా, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఆస్తి పన్ను, విద్యుత్తు బిల్లుల పరంగా రాయితీలు ఇవ్వాలని వారిరువురూ పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు ఇలా..
- మొత్తం ప్రైవేటు పాఠశాలలు : 10,500
- కార్పొరేట్ పాఠశాలలు : 1200
- బడా ప్రైవేటు పాఠశాలలు: 800
- బడ్జెట్ పాఠశాలలు : 8,500
- విద్యార్థుల సంఖ్య: సుమారు 32 లక్షల మంది
ఇదీ చదవండిః ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాం: వినోద్ కుమార్