రాష్ట్రంలో నూతనంగా స్థాపించిన ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టింది. బషీర్ బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్‌ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు చదువుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. బీసీలతో పాటు రిజర్వేషన్ల సాధన కోసం అన్ని ఎస్సీ,ఎస్టీ, ప్రజా సంఘాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించి.. ఫీజు రీయంబర్స్మెంట్ అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమాలు'