బీసీ కమిషన్ ఏర్పాటు పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ ఆరోపించారు. తక్షణమే కమిషన్ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని హైదరాబాద్లోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. 16 నెలలుగా కమిషన్ లేకపోవడంతో తమ బాధలు చెప్పుకోలేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు. బీసీల పట్ల చిన్నచూపు చూస్తూ అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.